ఉయ్యూరు: బందరు పోర్టు నిర్మాణంలో మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం సరికాదని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఉయ్యూరులోని ఆయన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో పోర్టుకు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఎన్నికల్లో ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాలుగేళ్లలో చేసిందేమీ లేదన్నారు.
మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలు సంక్రాంతి పండుగకు షిప్పును బందరు పోర్టుకు తీసుకొస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. అసత్య, అసాధ్య ప్రకటనలు చేస్తూ ఎంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. పనులు ఇప్పటికిప్పుడు ప్రారంభించినా పూర్తయ్యే సరికి రెండేళ్లు పడుతుందన్నారు. పుష్కరాలకు విజయవాడ ఫ్లైఓవర్ ప్రారంభిస్తామన్నట్లే పోర్టు ప్రారంభం కూడా అని ఎద్దేవా చేశారు. దుగ్గరాజుపట్నంలో పోర్టు సాంకేతికంగా సాధ్యం కాదని,
ఆర్థికంగా ఎలాంటి లాభం ఉండదని ఎక్స్‌ఫర్ట్ కమిటీలు రెండుసార్లు నివేదిక ఇచ్చినా సీఎం పదేపదే దుగ్గరాజుపట్నం ఎందుకు జప్పించాల్సి వస్తుందన్నారు. రామయ్యపట్నంలో పోర్టు కడితే రాయలసీమకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు పేరును పెడతానని జగన్ ప్రకటించడం అభినందనీయమన్నారు. తెలుగు జాతి గర్వపడే మహనీయుడు ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెడితే అందరూ హర్షిస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment