
మాజీ ఎమ్మెల్యే గుదిబండి కన్నుమూత
సీనియర్ రాజకీయ నేత, దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి (72) గురువారం కన్నుమూశారు.
తెనాలి: సీనియర్ రాజకీయ నేత, దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి (72) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న ఆయన్ని రెండురోజుల కిందట గుంటూరులోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో చేర్పించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే ఉదయం ఐదు గంటల కు మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని గుంటూరు జిల్లా కొల్లిపరలోని స్వగృహానికి తరలించారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధు లు, మాజీ నేతలు, అభిమానులు వెంకటరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన భార్య అరుణ, కుమారులు నర్సింహారెడ్డి, వేణుగోపాలరెడ్డి, సురేంద్రరెడ్డిలకు సానుభూతి తెలియజేశారు.
ప్రస్థానం ఇలా..: ఒకప్పటి దుగ్గిరాల నియోజకవర్గం పరిధిలోని కొల్లిపరలో 1944 ఏప్రిల్ 1న కామేశ్వరమ్మ, నరసింహారెడ్డి దంపతులకు ఆయన జన్మించారు. ఆయన తొలుత కొల్లిపర పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడిగా తొమ్మిదేళ్లు పనిచేశారు. 1989లో దుగ్గిరాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. అక్కడి నుంచే వరుసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించి ఆనవాయితీని బ్రేక్ చేశారు. విలువలు కలిగిన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు.
2009లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దుగ్గిరాల నియోజకవర్గం రద్దవడంతో వెంకటరెడ్డి ఆ తర్వాత ఎన్నికల్లో పోటీచేయలేదు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడైన ఆయన ఆ అభిమానంతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా ఉంటూ, 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పాటుపడ్డారు.
వైఎస్‌జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడని, ప్రజాసేవలో అహర్నిశలు శ్రమించే వారని జగన్ కొనియాడారు. వెంకటరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.