ఎమ్మిగనూరు టౌన్ : ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డ్‌లో ఆదివారం కమీషన్ ఏజెంట్లు రైతులను దగా చేయడానికి చేసిన ప్రయత్నం వికటించింది. రైతులు కన్నెర్ర చేయడంతో అధికారులు దిగివచ్చారు. ఆరుగాలం కష్టించి పండించిన దిగుబడులను అమ్ముకునేందుకు యార్డ్‌కు తీసుకురాగా.. కనిష్ట ధర కన్నా, కొనుగోలుదారులు నిర్ణయించిన రేటు కన్నా.. తక్కువకు కొనుగోలు చేయడానికి అలవాటు పడ్డ కమీషన్ ఏజెంట్లు ఆదివారం కూడా అలాగే చేయడానికి ప్రయత్నించగా రైతులు ఎదురుతిరిగారు. యార్డ్ ప్రధాన గేటును మూసివేసి ఆందోళనకు దిగారు.
పోలీసులు, యార్డ్ అధికారులు జోక్యం చేసుకోవడంతో రైతులు ఆందోళనను విరమించారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్‌కు ఆదివారం రైతులు 20 వేల బస్తాల వేరుశనగ కాయలను తీసుకువచ్చారు. కనిష్ట ధరగా రూ.3001, గరిష్ఠ ధరగా రూ.5089 నిర్ణయించారు. భారీగా వచ్చిన సరుకును చూసి ఇదే అదునుగా భావించిన ఇద్దరు కమీషన్ ఏజెంట్లు దగాకు తెరతీశారు. వ్యాపారులు నిర్ణయించిన ధరల్లో అతి తక్కువ ఉన్న ధరను కమీషన్ ఏజెంట్లు పరిగణనలోకి తీసుకొని రైతులను దోపిడి చేయాలని పథకం వేశారు. అలాగే వ్యాపారులు నిర్ణయించిన ధరతో పాటు ఆదివారం పలికిన కనిష్ఠ ధర కన్నా తక్కువ ధరను టెండర్ ఫారంలో రాసి రైతులకు మీ సరుకు ఇంతే రేటు పలికిందని నమ్మించబోయారు. ఉదాహరణకు 4, 18వ లాట్(కుప్ప)లో ఉన్న వేరుశనగ దిగుబడులను వ్యాపారి రూ.3909లకు కొనుగోలు చేస్తున్నట్లు టెండర్ ఫారంలో నమోదు చేయగా ఇద్దరు కమీషన్ ఏజెంట్లు రూ.2270కు మీ సరుకు అమ్ముడుపోయిందని రైతులకు తెలిపారు. ఇలా మొత్తం 18 లాట్లలోని రైతులను కమీషన్ ఏజెంట్లు దగా చేయాలని ప్రయత్నించారు.
అయితే కొంత మంది చదువుకున్న యువకులు కమీషన్ ఏజెంట్ల మోసాన్ని పసిగట్టి యార్డ్ కార్యాలయం ముందున్న నోటీస్ బోర్డును పరిశీలించారు. నోటీసు బోర్డులో కనిష్ఠ ధర రూ.3009లు, గరిష్ఠధర రూ.5089లు ఉండగా కమీషన్ ఏజెంట్లు రూ.1500 నుంచి రూ.3 వేల లోపు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో ఇతర రైతులకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో రైతులంతా కలిసి వ్యాపారులు టెండర్ ఫారంలో నమోదు చేసిన ధరల వివరాలను పరిశీలించారు. కనిష్ఠ ధరతో పాటు వ్యాపారులు నిర్ణయించిన ధరల కన్నా తమ సరుకు తక్కువకు అమ్ముడుపోయిందని కమీషన్ ఏజెంట్లు నమ్మించడంపై రైతులు తిరగబడ్డారు.
దీంతో కమీషన్ ఏజెంట్లు అక్కడి నుంచి తప్పించుకుపోయారు. రైతులంతా గుమిగూడి కమీషన్ ఏజెంట్ల ఆక్రమాలను ఎండగట్టాలని నిర్ణయించుకొని సాయంత్రం 4 గంటల సమయంలో మార్కెట్‌యార్డ్‌లో ఆందోళనకు దిగారు. ఆ తరువాత యార్డ్ ప్రధాన గేటును మూసివేశారు. దీంతో యార్డ్ లోపలికి వచ్చే వాహనాలన్నీ మంత్రాలయం రహదారిపై ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మార్కెట్‌యార్డ్ చైర్మన్‌కు, కార్యదర్శికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. దూషించారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు.
పాటు జరిగిందని, తాను సరిదిద్ది న్యాయం చేస్తానని యార్డ్ కార్యదర్శి వచ్చి రైతులకు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతులు ఇదే విషయమై పట్టణ ఎస్‌ఐ శంకరయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై యార్డ్ కార్యదర్శి యాసిన్‌ను విలేకరులు వివరణ కోరగా పొరపాటుతో పాటు ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఉన్నతాధికారులు, చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి కమీషన్ ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతన్నకన్నెర్ర
Published Mon, Mar 9 2015 3:26 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement