రైతన్నలకు పెద్ద కష్టమే వచ్చింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మార్కెట్ యార్డులు, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోళ్లు నత్తనకడన సాగుతున్నాయి. ఈ నెల మొదట్లో కేంద్రాలు ప్రారంభించిన నాటి నుంచి అదే ధోరణి. దీంతో పలువురు రైతులు తమ ధాన్యం కుప్పల వద్ద పదిహేను రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.
చీటికి మాటికి అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేసరికి మళ్లీ వర్షం పడుతుండటంతో ధాన్యం మొలకెత్తుతోంది. ధాన్యం కొన్న వెంటనే డబ్బులు చెల్లిస్తామని ఇంతవరకు పైసా ఇవ్వలేదని రైతులు మండిపడుతున్నారు. తడిసిన ధాన్యానికి వెంటనే కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లించాలని ఆందోళనలకు దిగుతున్నా.. అరణ్య రోదనే అవుతోంది.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. లారీల కొరత, మిల్లర్లు సహకరించకపోవడం, గన్నీ సంచులు, హమాలీల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. ఫలితంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల తీరు రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. కేంద్రాలకు, యార్డులకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఆ కుప్పల వద్దే నిరీక్షించక తప్పడం లేదు. ఇదే అదనుగా దళారులు, వ్యాపారులు రంగంలోకి దిగి అంది నకాడికి దోచుకుంటున్నారు. రబీ సీజన్‌లో ఒకేసారి ధాన్యం ముంచెత్తుతుందని తెలిసి కూడా అధికారులు ఏర్పాట్లలో శ్రద్ధచూపడం లేదు. 619 ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీల కొరత వేధిస్తోంది. ట్రాన్స్‌పోర్టు కిరాయి విషయమై మిల్లర్లకు లారీ యజమానులకు జరుగుతున్న వివాదంతోనే వాహనాలు అందుబాటులో ఉంచడం లేదని సమాచారం. మరికొన్ని చోట్ల సరిపడా గన్నీ సంచులు కేంద్రాలకు రాలేదు. 50 లక్షల గన్నీ సంచులు అవసరమున్నా అందుబాటులో ఉంచలేదు. ఫలితంగా తరలింపు ఆలస్యమై ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. స్థలం కొరత ఏర్పడి ధాన్యం ఆరబోయడానికి ఇబ్బంది అవుతోంది. సరిపడా కాంటాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల కొనుకోళ్ల ప్రక్రియ నత్తనకడన సాగుతోంది.
వ్యాపారులు తెచ్చిన ధాన్యాన్ని ముందుగా లోడింగ్, అన్‌లోడింగ్ చేసుకుం టున్న మిల్లర్లు... ఐకేపీ కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని ఆలస్యంగా తీసుకుంటున్నారు. దీం తో అన్‌లోడింగ్ కాక లారీలు అక్కడే నిలిచి పోతున్నాయి. రైతులకు కనీసం తాగునీరు, నీడ కల్పించడంలో అధికారులు, నిర్వాహకులు విఫలమయ్యారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచడం లేదు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా వాహనాలు, గన్నీ సంచు లు వచ్చేలా చూడకుండా... సరిపడా కాంటాలు ఏర్పడకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాయలేక ధర తక్కువైనా నేరుగా మిల్లులకు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.
చెల్లింపులేవీ?
ఈ నెల 4న కొనుగోళ్లు ప్రారంభం కాగా... ఇప్పటివరకు 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి సుమారు రూ.200 కోట్లు పెండింగ్ ఉన్నాయి. కొనుగోలు చేసిన వారం రోజుల్లోగా డబ్బులు అందిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎవరికీ డబ్బులు చెల్లించలేదు. ఆన్‌లైన్‌లో నేరుగా ఖాతాల్లో జమ చేస్తామంటున్న అధికారుల తీరుతో రైతులు మరింత ఆం దోళన చెందుతున్నారు. ఖాతాల్లోకి చేరిన డబ్బు ను రుణ బకాయి కింద బ్యాంకులు రికవరీ చేసుకుంటాయేమోనని భయపడుతున్నారు.
దండుకుంటున్నారు..
కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు మందగించడంతో దళారులు, వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. కల్లాల వద్దే క్వింటాల్‌కు రూ.1,200 నుంచి రూ.1,250 లోపు మాత్రమే చెల్లిస్తున్నారు. దళారుల దోపిడీ రోజుకు రూ.35 లక్షల వరకు ఉంటున్నట్లు అంచనా. సోమవారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు 15 వేల బస్తాల ధాన్యం వచ్చింది. తేమ సాకుతో ప్రభుత్వరంగ సంస్థలు ధాన్యం కొనుగోలు చేయలేదు. నాణ్యమైన ధాన్యానికి సైతం వ్యాపారులు మద్దతు ధరకంటే రూ.150 తక్కువగా ధర నిర్ణయించారు. ఇష్టముంటే అమ్ముకోండి... లేదంటే వెళ్లిపోండి.. అని వ్యాపారులు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో రైతులు ఆగ్రహంతో మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులను నిర్బంధించే ప్రయత్నం చేశారు. చివరకు దిక్కులేక క్వింటాల్‌కు రూ.100 తక్కువకు వ్యాపారులకే అమ్ముకుని వెనుదిరిగారు.
ధాన్యం రైతుల దైన్యం
Published Wed, May 21 2014 3:10 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement