ధర్మవరం టౌన్/అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ‘మార్కెట్ యార్డుకు వేరుశనగ కాయలను తీసుకొచ్చి 20 రోజులైంది. మూటలకు చెదలు పట్టి సంచులు చినిగి పోతున్నాయి.. ఇంకా ఎప్పుడు కొంటారు.. మార్కెట్ యార్డులోనే కాయలు పుచ్చిపోవాలా..’ అని అధికారులపై వేరుశనగ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేయింబవళ్లు కాపలాగా ఉన్నా తమ కాయలను తూకం వేయకుండా డబ్బులిచ్చిన వ్యాపారుల కాయలను అప్పటికప్పుడు తూకాలు వేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం వేరుశనగ రైతులు అనంతపురం జిల్లా ధర్మవరం మార్కెట్ యార్డు ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ కళ్ల ముందే దళారులు లారీలకు లారీల వేరుశనగ కాయలు అమ్ముకుని పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఒక్క అధికారి కూడా తమ గోడు పట్టించుకోలేదని మండిపడ్డారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో చివరకు పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.
కాటాలు తగ్గించేశారు
అనంతపురంలోని మార్కెట్ యార్డులో ఆయిల్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో శనివారం కాటాలు బాగా తగ్గించేశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కౌంటర్లు, కాటాలు పెంచాలని ఉన్నతాధికారులు చెబుతున్నా ఇక్కడ మాత్రం అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రోజూ ఐదు కాటాలతో తూకాలు వేస్తుండగా శనివారం రెండింటికే పరిమితం చేశారు. రోజుకు వంద నుంచి 120 మంది రైతులకు చెందిన వేరుశనగ తూకాలు వేస్తుండగా శనివారం 50 మంది రైతులకు కూడా న్యాయం జరగలేదు.
ఇంతవరకు కొనుగోలు చేసిన వేరుశనగను నెట్లు వేయడానికి హమాలీలను వాడుకున్నారు. దీంతో వారం పది రోజులుగా వేచిచూస్తున్న రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్యలో కొందరు దళారులు, వ్యాపారులు తమ పనులు యథేచ్చగా సాగిస్తున్నారని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కాటాలు పెంచాలని రైతులు, రైతు సంఘాల డిమాండ్లను ఆయిల్‌ఫెడ్ అధికారులు బేఖాతరు చేస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా గడువు పెంచినట్లు తమకింకా అధికారిక ఉత్తర్వులు రాలేదంటూ గందరగోళానికి గురి చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
ఎప్పుడు కొంటారయ్యా..?
Published Sun, Feb 2 2014 2:43 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement