శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలో ఆశ్రీత రబ్బరు పరిశ్రమలో గురువారం బాయిలర్ లీకై మంటలు ఎగిసిపడడంతో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. కార్మికులు, స్థానికుల కథనం ప్రకారం.. తెల్లవారుజామున 5.30 గంటలకు పరిశ్రమలోని బాయిలర్ నుంచి యంత్రాల వరకు రసాయనాలను తీసుకెళ్లే థెర్మో పైపులైన్ లీకైంది. కార్మికులు విశ్రాంతి తీసుకునే గదిపై నుంచే ఈ పైపులైన్ ఉండడంతో రేకులు పగిలిపోయి గదిలో రసాయనాలు పడ్డాయి. దీంతో గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో నిద్రిస్తున్న నలుగురు బీహార్ కార్మికులు సందీప్(22) నావల్‌యాదవ్(40), జోగిందర్ చౌదరి (42), జైకిషన్(45) సజీవ దహనమయ్యారు.
కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సవూచారమివ్వగా, ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం జైకిషన్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని భావించిన గగన్‌పహాడ్ వాసులు ఆగ్రహంతో అక్కడి ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. అంతటితో ఆగకుండా పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ దుర్ఘటనపై జిల్లా కలెక్టర్‌ను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నివేదిక కోరినట్లు తెలిసింది.