2014 ప్రాధాన్యతాంశాలుగా పాలన
Published Wed, Jan 1 2014 3:10 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
సాక్షి, గుంటూరు :కొత్త ఏడాదిలో నాలుగు ప్రాధాన్యత అంశాలుగా జిల్లా పాలన సాగనుందని కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. గడిచిన ఏడాదిలో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలో పతకాలు లభించాయన్నారు. మంగళవారం సాయంత్రం గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టరు మాట్లాడారు. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉందని, అభివృద్ధి కార్యక్రమాలకు రెండు,మూడు నెలలు మాత్రమే సమయం వుందన్నారు.నాలుగు ప్రాధాన్యత అంశాల కింద సంక్రాంతి పండుగ తర్వాత డివిజన్ స్థాయిలో జిల్లా అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలోనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహణ, ఇంకా నిర్మల్ భారత్ అభియాన్ కింద పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే 70 వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. లక్ష మరుగుదొడ్లు నిర్మించే దిశగా లక్ష్యం పూర్తి చేస్తామని చెప్పారు. చివరగా, జిల్లాలో ఇంకా పది లక్షల మంది నిరక్షరాస్యులు వున్నారన్నారు. 18 మండలాల్లో 50 శాతం కంటే తక్కువ సాక్షరత ఉందని, ఈ మండలాల్లోని 305 గ్రామాల్లో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు సాక్షర భారత్ కింద కార్యక్రమం రూపొందించామని ప్రకటించారు.
జీఎంసీలో అవినీతి వాస్తవమే
జిల్లాలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, చేయలేకపోతున్నామనే బాధా ఉందని జిల్లా కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందులో జీఎంసీలో అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకొచ్చారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజా భాగ స్వామ్యం తప్పనిసరని, నగరంలో ప్రజల స్పందన అంతంత మాత్రంగానే ఉందన్నారు. ‘ఊరంటే గుంటూరే’ కార్యక్రమంలో నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయన్నారు. నగర పాలక సంస్థలో అవినీతి ఎక్కువగా ఉన్న విషయం వాస్తవమేనన్నారు.
ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎక్కువగా ఉందని, అక్రమ కట్టడాలపై తుది నోటీసులు ఒక్క కేసులో తప్ప ఏ ఒక్క దాన్లోనూ అధికారులు ఇవ్వలేదని, దీనిపై దృష్టి సారిస్తానని తెలిపారు. జీఎంసీలో అవినీతిపై తన ఫోన్ నంబరు ఇచ్చి వివరాలు తెలియజేయవచ్చని ప్రకటిస్తే కేవలం ఐదారు ఫోన్లు మాత్రమే వచ్చాయన్నారు. పెద్ద ఎత్తున స్పందన వస్తుందనుకుంటే, అలా జరగలేదన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో సభ్యులుగా ఉన్న వారితోనే అడహక్ కమిటీ వేశామని, ఇందులో రాజకీయ కోణం గురించి తనకు తెలియదని కలెక్టరు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారులపై వేమూరు ఎమ్మెల్యే చేయి చేసుకున్న సంఘటనకు స్పందిస్తూ అదనపు జేసీని విచారణ అధికారిగా నియమించామని, ఇప్పటికే విచారణ ప్రారంభించారన్నారు. ఓటర్ల జాబితాపై టీడీపీ వారిచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్నారు.
మూడు లక్షల ఓటర్ల దరఖాస్తులు
జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల వరకు ఓటర్ల చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాలపై దరఖాస్తులు అందాయని కలెక్టరు వివరించారు. జనవరి 9 లోగా విచారణ చేసి 16న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా ప్రచురిస్తామన్నారు. ఇరవై సూత్రాల పథకం అమలులో జిల్లా ఎనిమిదవ స్థానంలో ఉండగా, గృహ నిర్మాణం, ఆధార్ అనుసంధానం తదితర అంశాల్లో వెనుకంజలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్ల నిధులతో జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి నిర్మించనున్నట్టు తెలిపారు. జనవరి 18లోగా మిలీనియం ఆస్పత్రికి సౌకర్యాలన్నీ సమకూరతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement