ఓటుతో ప్రశ్నించే హక్కు
Published Wed, Apr 9 2014 12:58 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్,సురేశ్‌కుమార్ హెచ్చరించారు. అలాగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కు ఉండదని, ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు.
- సాక్షి ప్రతినిధి, గుంటూరు
వరుస ఎన్నికలను ఎలా ఎదుర్కొంటున్నారు?
పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికలు వరుసగా ఒకేసారి రావడం చాలా అరుదు. ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని పనిచేశాం. పంచాయతీ ఎన్నికల అనుభవంతో మిగిలిన ఎన్నికలను సమర్ధంగా నిర్వహించాం. ఇందుకోసం ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నాం. మొత్తం రెండువేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. జిల్లా పరిస్థితులపై పోలీస్ అధికారులకు, నాకు పూర్తిగా అవగాహన ఉంది. మేమంతా జిల్లాకు వచ్చి రెండు సంవత్సరాలైంది. దీని వలన రాజకీయ పార్టీలు, నాయకుల వైఖరిపై అవగాహన ఏర్పడింది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నాం.
ప్రజలకు ఈవీఎంలపై ఎలా అవగాహన కల్పిస్తున్నారు?
నగరంలో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందులో ఈవీఎంల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఓటర్లు ఎవరైనా సరే ఈ మోడల్ కేంద్రానికి వచ్చి ఈవీఎంపై వారికి ఉన్న అభ్యంతరాలు, సందేహాలను తీర్చుకోవచ్చు.
ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఎటువంటి
చర్యలు తీసుకుంటున్నారు?
పంచాయితీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను, పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. అలాగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా చూస్తున్నాం. ఎవరైనా గొడవులు చేసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా బైండోవర్ చేస్తున్నాం. మిగిలిన ఎన్నికల వరకు వారిని బయటకు రాకుండా చూస్తాం. జేసీ, ఆర్డీవో, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, రిటర్నింగ్ అధికారుల సహకారంతో సమర్ధంగా విధులు నిర్వహించగలుగుతున్నాం. మంచి టీమ్ వర్క్‌తో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సుల రక్షణ ఏ విధంగా..?
జిల్లాలో 12 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను గుంటూరు, తెనాలి, నరసరావుపేట కేంద్రాల్లో భద్రపరుస్తున్నాం. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులను సైతం జిల్లా కేంద్రానికి తరలిస్తున్నాం. బ్యాలెట్ బాక్సులకు పటిష్ట రక్షణ చేపడుతున్నాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూస్తున్నాం.
ఓటుహక్కుపై ప్రజల్లో ఎటువంటి చైతన్యం తీసుకువస్తున్నారు?
ఓటుహక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కు ఉండదు. చదువుకున్న వారే ఎక్కువమంది ఓటుహక్కు వినియోగించుకోవడం లేదు. దీన్ని అధిగమించేందుకు స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లకు సమాచారం ఇవ్వడం, అవగాహన కల్పించడం, వారిని చైతన్య పరచడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులు, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాం. అలాగే పోలింగ్ కే ంద్రాల వద్ద వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటుహక్కు ప్రాధాన్యత తెలిపేందుకు రంగోళి, క్విజ్, 3కే వాక్ వంటి పోటీలు నిర్వహిస్తున్నాం.
గ రాజకీయపార్టీలకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?
ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. పోలింగ్ సమయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తన దిృ్టకి తీసుకురావచ్చు లేదా సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
Advertisement
Advertisement