కౌంటింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ సూచించారు. శనివారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో కౌంటింగ్ సూపర్‌వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, రిటర్నింగ్ అధికారులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలని సూచించారు. ఈవీఎం నుంచి రిజల్ట్స్‌ను ఏజెంట్లకు కన్పించే విధంగా చూపాల్సి ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ హాలులో 7 టేబుల్స్ పార్లమెంట్‌కు, 7 టేబుల్స్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలలో సూక్ష్మపరిశీలకులు పర్యవేక్షిస్తారన్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న అధికారులు వారికి కేటాయించిన చోట ఈనెల 15న ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. అక్కడ వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, తప్పని సరిగా అందరూ హాజరు కావాలని ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు అదనంగా కౌంటింగ్ అసిస్టెంట్‌ను కేటాయించామని, వారి సేవలను వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. మెప్మా ప్రాజెక్టు డెరైక్టరు కృష్ణకపర్థి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. సిబ్బందికి వచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో జేసీ వివేక్‌యాదవ్, అదనపు జేసీ కె.నాగేశ్వరరావు, తెనాలి, నరసరావుపేట ఆర్డీవోలు శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరావు, నగరపాలకసంస్థ కమిషనర్ నాగవేణి తదితరులు పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూంల భద్రత పరిశీలన
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూంల భద్రతను గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టరు, ఎస్.సురేశ్‌కుమార్ శనివారం పరిశీలించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని తాడికొండ, మంగళగిరి, గుంటూరు తూర్పు,పశ్చిమ, ప్రత్తిపాడు,పొన్నూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఇక్కడి స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన విషయం తెలిసిందే. వర్షాల వల్ల రాష్ర్టంలో కొన్ని చోట్ల ఈవీఎంలు భద్రపరిచిన గదుల్లోకి వర్షపునీరు వెళ్ళిందని వార్తలు రావటంతో కలెక్టర్ వచ్చి పరిశీలించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద ఇబ్బంది లేదని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఈవీఎంల వివరాలను స్ట్రాంగ్‌రూంల వద్ద ఉన్న కంప్యూటర్లలో పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల వద్ద వర్షపునీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు తహశీల్దార్ చెన్నయ్యను కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట నగరపాలకసంస్థ కమిషనర్ నాగవేణి, తెనాలి రిటర్నింగ్ అధికారి శ్రీనివాసమూర్తి తదితరులున్నారు.
స్ట్రాంగ్ రూంలు పరిశీలించిన జేసీ
గుంటూరు సిటీ: నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరచిన స్థానిక లయోలా పబ్లిక్ స్కూల్‌లోని స్ట్రాంగ్ రూంలను నరసరావుపేట పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్ శనివారం పరిశీలించారు. అక్కడి భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. గార్డ్స్ వద్ద ఉన్న రిజిస్టర్‌లో ఆయన సంతకం చేశారు.