గంగరాజుగారి గెస్ట్‌హౌస్‌లో దాష్టీకం!
తాడేపల్లి రూరల్ (గుంటూరు) : అది ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్. కృష్ణా తీరంలో ఉంది. ఆయన బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా సరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. కృష్ణా తీరంలో ఉన్న ఆయన గెస్ట్‌హౌస్‌లో వీఐపీలు, వీవీఐపీలు బస చేస్తుంటారు. సదరు పారిశ్రామికవేత్త ఇచ్చే ‘ఆత్మీయ ఆతిథ్యం’తో సంతృప్తిచెంది వెళ్తుంటారు. పోలీసు అధికారుల నుంచి, సినిమా నటుల వరకు పార్టీలతో సంబంధం లేకుండా పొలిటీషియన్లకు అక్కడ రాచమర్యాదలు జరుగుతుంటాయని సమాచారం. సామాన్యులకు లోపలకు ప్రవేశం ఉండదు.
కృష్ణా నదిని ఆక్రమించుకుని, నది లోపలకు అద్భుతమైన లాంజ్‌గా నిర్మించిన ఆ గెస్ట్‌హౌస్ లోపల జరిగే విషయాలు బయటకు పొక్కవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గెస్ట్‌హౌస్‌లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు కాళ్లు, చేతులు విరిగిన స్థితిలో బుధవారం గుంటూరు ప్రభు త్వ ఆస్పత్రి పాలయ్యూడు. ఏప్రిల్ 24న గెస్ట్‌హౌస్‌లో ఇనుప రాడ్లతో అత డిని కొందరు చితకబాదినట్టు సమాచా రం. ‘బాధలు భరించలేను.. చచ్చిపోతున్నా.. రక్షించండి...’ అంటూ కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వినిపించుకోకుండా అతణ్ణి రాక్షసంగా చితకబాదినట్లు తెలుస్తోంది. బాధితుడి పేరు పి.సైదా. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన అతను గెస్ట్‌హౌస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా డు.
అతణ్ణి చితకబాదిన వారిలో గెస్ట్‌హౌస్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సతీష్‌తోపాటు మరికొందరు ఉన్నట్లు బాధితుని బంధువులు చెబుతున్నారు. ఈ విషయంపై నోరు మెదిపేందుకు సైతం సైదా భయపడుతున్నాడు. గెస్ట్‌హౌస్ పనివారు చెబుతున్న దానిప్రకా రం సైదా ఏప్రిల్ 24న ఆలస్యంగా విధులకు హాజరయ్యాడని సమాచా రం. సూపర్‌వైజర్ అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదని.. ఆ కోపంతోనే కొట్టారని అంటున్నారు. ఇంత చిన్నకారణానికే అంత దారుణంగా కొడతారా అని ప్రశ్నిస్తే మాకేం తెలి యదు, మమ్మల్ని అడగొద్దంటూ సిబ్బంది పారిపోతున్నారు. ఈ దాడికి బలమైన కారణం ఏదో ఉండి ఉంటుం దని, అది బయటకు రాకుండానే సైదాపై దాడిచేసి ఉంటారని, రహస్యం గా చికిత్స చేయించేందుకు విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పిం చారని స్థానికులు అనుమానిస్తున్నారు.
కాలు, చెయ్యి విరగడం, కంటిపై భాగంలో తీవ్ర గాయమవడం, బీపీ విపరీతంగా పెరగడంతో అతనికేదైనా జరిగితే తమ పీకల మీదకొస్తుందంటూ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేయడంతో హడావుడిగా ఆరు రోజుల అనంతరం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి నుంచి ప్రభుత్వాస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అయితే విషయం చెప్పేందుకు వారు సైతం నిరాకరించడం గమనార్హం.