జిల్లాలో 81.9శాతం పోలింగ్ నమోదు
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 81.9 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అత్యధికంగా 88.93 శాతం, తాడికొండలో 88.87 శాతం, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 64.99 శాతం, గుంటూరు తూర్పులో 68.17 శాతం నమోదైనట్టు తెలిపారు. 36,46,011 మంది ఓటర్లకుగానూ 29,85,871 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. 2009 ఎన్నికలలో 77.6 శాతం నమోదైనట్లు చెప్పారు. దాదాపు 5శాతం పెరగడం మంచి పరిణామమన్నారు. ఓట్లలెక్కింపునకు 1,200 మందిని నియమిస్తున్నామని తెలిపారు. 16న కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 15న సాయంత్రం 5గంటలులోగా పోస్టల్ బ్యాలెట్‌లు అందాలని చెప్పారు. ఎన్నికల విధులలో ఆకస్మికంగా మరణించిన కెవికె కిషోర్, మహబూబ్‌నగర్‌కు చెందిన హోంగార్డు వైకుంఠం కుటుంబసభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో జెసి వివేక్‌యాదవ్, డిఆర్వో కె.నాగబాబు తదితరులు పాల్గొన్నారు.