రుణ ప్రణాళిక రూ.12,491 కోట్లు
సాక్షి, గుంటూరు: కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వంద శాతం రుణ లక్ష్యాన్ని సాధించే విధంగా బ్యాంకర్లు, అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో డీసీసీ (డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ) సమావేశంలో 2014-15 సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. గతేడాది కంటే 16.15 శాతం వృద్ధితో రూ.12,491.43 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఎన్నికల కోడ్ కారణంగా 89 శాతం రుణ లక్ష్యం సాధించామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు, రుణ లక్ష్యాలను సంపూర్ణంగా అమలుచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది రూ.10,753 కోట్ల రుణ లక్ష్యం కాగా, ఈ ఏడాది రూ.1,737 కోట్లు అదనంగా పెంచినందుకు బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు.
వ్యవసాయ రుణాల కింద రూ.7,662.94 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.2,900.90 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,927.59 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగ రుణాలకు అత్యధికంగా రూ.6,328.57 కోట్లు కేటాయించడం ముదావహమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేయాల్సిన వార్షిక రుణ ప్రణాళిక ఎన్నికల కారణంగా జూన్ నెలలో విడుదల చేయాల్సి వచ్చిందని వివరించారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం వి.ఎం.పార్ధసారథి, నాబార్డు ఏజీఎం ఏవీ భవానీ శంకర్, ఆర్‌బీఐ ప్రతినిధి మురళీధర్, లీడ్ బ్యాంకు మేనేజర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.