సాక్షి ప్రతినిధి, విజయనగరం : నవ్యాంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు ప్రకటించిన పది హామీల్లో ఒక్కొక్కటి చే జారిపోతున్నాయి.నేతల చేతగాని తనం, పలువురి స్వార్థ ప్రయోజనాలకు జిల్లాకొచ్చే అరుదైన అవకాశాలు దూరమవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వ వైద్య కళాశాల....ఈ రోజు గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలయ్యేంతవరకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామన్న చంద్రబాబునాయుడు ప్రైవేటు వైద్య కళాశాలతో సరిపుచ్చారు.
జిల్లా ప్రజల ఏళ్ల నాటి గిరిజన యూనివర్సిటీ కలను సాకారం చేస్తామని గొప్పగా చెప్పిన టీడీపీ సర్కార్ ఇప్పుడేమో ప్రతిపాదిత స్థలం సానుకూలంగా లేదని పొరుగు జిల్లాకు తరలించనుంది. దీనికి స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యమే కారణంగా తెలుస్తోంది. శాసనసభలో చంద్రబాబు ప్రకటించిన వరాలు జిల్లాకు అందకుండా పోతున్నాయి. ఇప్పటికే రెండు చేజారిపోగా మిగతా ఎనిమిదిపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
చేతిలోకి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, గిరిజన యూనివర్సిటీయే చేజారిపోయిందంటే కష్టసాధ్యమైన స్మార్ట్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, ఫుడ్ పార్క్, పారిశ్రామి నగరం, నౌకాశ్రయం, లలిత కళల అకాడమీ ఏర్పాటు అంత సులువా అనే సంశయం అందరిలో ఏర్పడింది. సర్కార్ చిన్నచూపు ఒకటైతే, మన నేతల వైఫల్యం మరో కారణంగా నిలిచింది. ఒక ట్రస్టుకు కట్టబెట్టేందుకు గాను ప్రభుత్వ వైద్య కళాశాల బదులు ప్రైవేటు కళాశాలను కేటాయించగా, మాన్సాస్ స్థలంలోనే ఏర్పాటు చేయాలన్న ఏకైక లక్ష్యం, మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేయకపోవడంతో గిరిజన యూనివర్సిటీ జిల్లాకు దూరమైన దుస్థితి చోటు చేసుకుంది.
దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన యూనివర్సిటీని జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని, దక్షిణ భారతదేశంలోనే గిరిజన విద్యార్థుల కోసం నిర్మిస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా గొప్పలు పలికారు. ఆ మేరకు పాచిపెంట మండలం వేటగానివలస సమీపంలో గల కన్నయ్యవలస, చాపరాయివలస మధ్యలో ఉన్న మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ సుమారు 3,370 ఎకరాల భూమి ఉండగా, అందులో 500 ఎకరాల వరకు కేటాయించడానికి సుముఖత చూపారు. ఆమేరకు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన కేంద్ర బృందం వచ్చి పరిశీలన కూడా చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.పి.సిసోడియా, నీలం సహాని,రామ బ్రహ్మం బృందం పూర్తిగా పరిశీలించాక గిరిజన యూనిర్సిటీ ఏర్పాటుకు అనుకూల ప్రాంతంగా తమ అభిప్రాయాన్ని కూడా ఆ సందర్భంలో వ్యక్తం చేసింది. దీంతో గిరిజన యూనివర్సిటీ జిల్లాకే దక్కుతుందని సంతోషించారు.
అయితే, ఆ ఆశ అడియాసైంది. పరిశీలించిన వెళ్లిన కేంద్రబృందం తమ అభిప్రాయం మార్చుకుంది. ఇక్కడి స్థలం గిరిజన యూనివర్సిటీకి సానుకూలం కాదని తేల్చి చెప్పేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు. అంతటితో ఆగకుండా విశాఖ జిల్లాలోని సబ్బవరంలో ఉన్న స్థలాన్ని ప్రతిపాదిస్తున్నట్టు తెలియజేశారు. పాచిపెంట మండలంలో ప్రతిపాదించిన స్థలానికి కనెక్టవిటీ లేదని, జిల్లా కేంద్రానికి దూరంగా ఉందని, అన్నీ రకాలుగా సానుకూలమైనది కాదని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు జల్లినట్టుయింది. దీనికీ మన ప్రజాప్రతినిధుల ప్రయత్నం, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేయకపోవడమే కారణంగా తెలుస్తోంది.
ఆరోజే మరో కొన్ని ప్రతిపాదనలు చేసి ఉంటే ఒకటి కాకపోతే మరొకటైనా పరిశీలనలోకి తీసుకునేది. వాస్తవానికైతే, బొండపల్లి, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో అనుకూల స్థలాలున్నా వాటిని ప్రతిపాదించకుండా కేవలం పాచిపెంట మండలంలో ఉన్న మాన్సాస్ భూములను చూపించి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడిదే కొంప ముంచింది. ఆ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించడమే కాకుండా మరో ప్రతిపాదన పంపించే వెసులుబాటును కూడా ఇవ్వలేదు.
ఈ సమయంలోనైనా మన కేంద్ర, రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్ తదితరులంతా గట్టిగా ఒత్తిడి చేసి ఉంటే ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు అవకాశం ఇచ్చేది. దీంతో జిల్లాలో ఉన్న వేలాది మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మన పాలకులు మేల్కొని మరో ప్రతిపాదనకు అవకాశం ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సి ఉంది.
చేజారిన గిరిజన వర్సిటీ !
Published Fri, Nov 14 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement