సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉచితం... ఇసుక కూడా ఉచితం! ఈ మాట అన్నది ఎవరో కాదు... సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్ర బాబు! సీజన్ ప్రారంభమైనా ఇళ్ల నిర్మాణాలకు ఇసుక దొరక్క అల్లాడిపోతున్న ప్రజలకు ఇదేదో బాగుందే అనిపించింది! మరి అధికార పార్టీ నాయకులకు ఎలా ఉంటుంది? ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై దాడులకు తెగబడినవారు ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తామంటే -
ఊరుకుంటారా? కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు! అక్కడే ఏదో మతలబు ఉందని ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు.
డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగింత అనే విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తొలుత ప్రకటించినా తెరవెనుక చక్రం తిప్పింది అధికార పార్టీ నాయకులే అనేది బహిరంగ రహస్యం. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం ఇటీవలే ఈ-టెండర్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. అదికూడా బెడిసికొట్టడంతో చంద్రబాబు ఫ్రీ అస్త్రాన్ని ప్రయోగించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉచితమే అయినా రీచ్‌ల్లో ఇసుకను తవ్విపోసే బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించాలనే ప్రతిపాదన అధికారవర్గాల నుంచి వినిపిస్తోంది.
మూణ్ణాళ్ల ముచ్చటేనా?
రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, రవాణా పర్యవేక్షణ, ర్యాంపు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర బాధ్యతలను దక్కించుకుంటే మళ్లీ చక్రం తిప్పవచ్చనే ఆలోచనతో సిండికేట్లు ఉన్నాయి. దీంతో నామమాత్ర రుసుంతో ర్యాంపులను తమకు అప్పగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బంధువులైన టీడీపీ నాయకుల ద్వారా ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. లేదంటే జన్మభూమి కమిటీలకే ‘స్థానిక సంస్థల’ ముసుగులో అప్పగిస్తే బాగుంటుందనే వాదనలను తీసుకొస్తున్నట్టు తెలిసింది.
బెడిసికొట్టిన ఈ-టెండర్లు..
జిల్లాలో 20 ర్యాంపులకు ఇటీవల ఆన్‌లైన్‌లో ఈ-టెండర్ల ప్రక్రియను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 277 మంది టెండర్లు వేశారు. వీరిలో 247 మందిని ఈ-వేలంకు అర్హులుగా అధికారులు ఎంపిక చేశారు. కానీ తెరవెనుక ర్యాంపుల వారీగా బిడ్డర్లు అంతా రెండుసార్లు సమావేశమై సిండికేట్‌కు తెరలేపారు. ఈ వేలంలో క్యూబిక్ మీటరు ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.500 కంటే ఎక్కువగా బిడ్డర్లు కోట్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రూ.500 కంటే ఎక్కువ, రూ.150 కంటే తక్కువ కోట్ చేసిన బిడ్డర్లను పక్కన పెట్టారు.
మిగిలిన వాటిలో ఎక్కువ కోట్ చేసినవారికి ర్యాంపులను అప్పగించే ప్రక్రియ చేపట్టారు. పులిదిండి ర్యాంపునకు ఒకే టెండర్ దాఖలు కావడం, గోపాలపురం ర్యాంపుపై కోర్టులో వివాదం ఉండటంతో నిలిపివేశారు. ఊబలంక ర్యాంపునకు 20 మంది బిడ్డర్లు సిండికేటై రూ.164 అత్యధిక ధరకు టెండర్ వేశారు. కానీ ముఖ్యనేతకు బంధువుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి రూ.354కు కోట్ చేయడంతో అధికారులు తప్పుడు టెండర్లు దాఖలైనట్టు గుర్తించి నిలిపివేశారు. అంకంపాలెం ర్యాంపులో కూడా ఇదే తరహా సమస్యతో నిలిపివేశారు. మిగిలిన 16 ర్యాంపుల్లో ఎనిమిది ర్యాంపులను బిడ్డర్లకు అప్పగించారు.
అయినవిల్లి-వీరవల్లిపాలెం రూ.204, వాడపాలెం- నారాయణలంక రూ.172, వద్దిపర్రు రూ.222, రాజవరం-వెలిచేరు రూ.206, కోరుమిల్లి రూ.202, కపిలేశ్వరపురం-2 రూ.206, బ్రిడ్జిలంక రూ.152, కేతవానిలంక రూ.202 కోట్ చేసినవారికి అప్పగించారు. ముగ్గళ్ల రూ.498, జొన్నాడ రూ.490, బొబ్బర్లంక- పేరవరం రూ.498, కపిలేశ్వరపురం-1 రూ.498, రాయన్నపేట రూ.498, ఎక్కువ మంది కోట్ చేయడంతో డ్రా తీసి ర్యాంపులు అప్పగిస్తారని, వేమగిరి- కడియపులంక, ఆత్రేయపురం, మందపల్లి ర్యాంపులకు రూ.150 కంటే తక్కువ రూ.500 కంటే ఎక్కువ కోట్ చేసిన వారు ఉండటంతో కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకొంటారని భావించారు. ఇంతలో ముఖ్యమంత్రి ఉచిత ఇసుక ప్రకటన చేయడంతో ఆ ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది.
ఇసుకు మాఫియా యత్నాలు
ఉచిత ఇసుక విధానం సాధ్యం కాదని రాజకీయ వర్గాల నుంచే వాదనలు వినిపించడంతో ఇసుక మాఫియాలు తిరిగి ర్యాంపులను పాత బిడ్‌లతో దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని ర్యాంపులపై స్టేలు తెచ్చేందుకు సన్నాహాలు చేయడంతోపాటు కోనసీమలోని ఓ నియోజకవర్గంలో ర్యాంపులను సిండికేటు చేయడానికి మంగళవారం ఒక రహస్య ప్రాంతంలో మాఫియా సమావేశమైనట్టు తెలిసింది. కొందరు బిడ్డర్లు అడ్డం తిరగడంతో బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవి బెడిసికొట్టాయి.
ఉచితం వెనుక స్వీయ హితం
Published Wed, Mar 2 2016 12:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement