
మంటల్లో కోనసీమ
లాభాల యావే తప్ప భద్రత పట్టని చమురు కంపెనీలు
అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం నుంచి అపారమైన చమురు, సహజవాయువులను తరలించుకుపోతున్న చమురు సంస్థలు అక్కడి ప్రజల భద్రతను పూర్తిగా గాలికొదిలేశాయి. స్థానికాభివృద్ధి పేరుతో అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటూ ప్రమాదాల నిరోధానికి కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడంలేదు. దీంతో కోనసీమ ఏ క్షణమైనా పేలే మందుపాతరలా మారిపోయింది. గత రెండు దశాబ్దాల్లో ఈ ప్రాంతంలో ఐదు బ్లో అవుట్లు సంభవించాయి. పదుల సంఖ్యలో పైప్‌లైన్ లీకేజీలు జరిగాయి. ఆ ఘటనల్లో కేవలం ఆస్తి నష్టాలే జరిగాయి. తాజాగా నగరంలో శుక్రవారం సంభవించిన గ్యాస్ పైపులైన్ పేలుడులో 16 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 27 మంది క్షతగాత్రులై విషమ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆక్రోశిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటనలు గుప్పించడం, తరువాత ఆ విషయాన్ని గాలికి వదిలేయడం షరా మామూలైందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రజల భద్రత గాలికి...
కోనసీమ భూగర్భంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర చమురు సంస్థలకు చెందిన గ్యాస్ పైపులైన్లు ఉన్నాయి. 30కి పైగా చమురు బావులున్నాయి. తాటిపాకలో మినీ రిఫైనరీ, గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్(జీసీఎస్) ఉన్నాయి. కేజీ బేసిన్ పరిధిలో తరచూ ఏదో ఒకచోట గ్యాస్ లీకవ్వడం, ఆస్తి నష్టం వాటిల్లడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఓఎన్జీసీ గతంలో ఒక అధ్యయన కమిటీని నియమించింది. ఈ ప్రాంత భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువైనందున పైపులైన్లు త్వరగా తుప్పుపట్టి పాడైపోతాయని కమిటీ తేల్చి చెప్పింది. కనీసం ప్రతి ఏడేళ్లకోసారైనా పైపులైన్లను తప్పక మార్చాలని సూచించింది. అయితే ఈ నివేదికను ఓఎన్జీసీ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రైవేటు చమురు సంస్థల గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. తాటిపాక గెయిల్ టెర్మినల్ పాయింట్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ సంస్థకు పైపులైన్ ద్వారా రోజుకు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా జరుగుతుంది. ఇందుకు 18 ఎం.ఎం. ట్రంక్ పైపులతో 15 ఏళ్ల కిందట పైప్‌లైన్ వేశారు. అధ్యయన కమిటీ సూచనల మేరకు దాన్ని ఇప్పటికి రెండుసార్లు మార్చాల్సి ఉండగా అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మూడు నెలల కిందట గ్యాస్ లీకవ్వగా తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. అప్పుడే పటిష్టమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పెనువిషాదం వాటిల్లేది కాదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బుగ్గి చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఉత్తుత్తి ఉద్యమాల్లో నాయకులు
ఈ ప్రాంత సహజ సంపదతో కోట్లు ఆర్జిస్తున్న చమురు సంస్థలు నిబంధనల ప్రకారం లాభాల్లో 2 శాతం ఆ ప్రాంతం అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంది. ఈ నిబంధన ను ఆ సంస్థలు ఏనాడూ నూరుశాతం అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రజలు దీనిపై పోరాటాలు చేస్తున్నా ఖాతరు చేయడంలేదు. ప్రజాప్రతినిధులు సైతం ఉత్తుత్తి ఉద్యమాలే చేసి ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.