మృత్యుకీలలు | 16 killed, 18 injured in AP blaze after Gail gas pipeline bursts | Sakshi
Sakshi News home page

మృత్యుకీలలు

Published Sat, Jun 28 2014 3:20 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

మృత్యుకీలలు - Sakshi

మృత్యుకీలలు

కోనసీమవాసులకు సుఖసంతోషాల్నివ్వకపోగా కష్టనష్టాల పాలు చేస్తున్న ఆ గడ్డ గర్భంలోని సంపదే.. వారి పాలిట పెనుగండంగా మారింది. కలుగుల్లోని కాలనాగుల్లా ఆ గడ్డ పొరల్లో విస్తరించిన గ్యాస్ పైపులైన్లలో ఒకటి విస్ఫోటించి 15 నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. మరో 27 మందిని మృత్యువు పిడికిట్లో ఇరికించింది. పద్మవ్యూహంలో అభిమన్యుని చుట్టుముట్టిన కౌరవుల్లా.. చెలరేగిన అగ్నికీలల నడుమ చిక్కుకున్న అమాయకులు కార్చిచ్చులో మొలకల్లా మాడిపోయారు.

కొందరు.. జరుగుతున్నది నిజమో, పీడకలో తెలియకుండా నిద్రలోనే కన్నుమూశారు. మరి కొందరు పగవారిలా తరిమే కీలల బారి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీసినా ఫలితం లేక విగతజీవులై నేలకొరిగారు. వేకువకు ముందే విరుచుకుపడ్డ విలయాగ్ని చివరికి పచ్చని పంటపొలాలనూ, తోటలనూ, మూగజీవాలనూ బుగ్గి చేసింది.


- నేలలోని గొట్టాలే.. కాలయముని హస్తాలు
- పచ్చనిసీమపై విరుచుకుపడ్డ చిచ్చు
- నగరంలో విస్ఫోటించిన పైపులైన్
- 15 మంది సజీవ దహనం, 27 మందికి గాయాలు
- వారిలో 15 మంది పరిస్థితి విషమం
సాక్షి, కాకినాడ / మామిడికుదురు :
మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం ఉదయం 5.10 గంటల సమయంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు చెందిన ట్రంక్ పైపులైన్ పేలిన ఘటనలో గతంలో ఎన్నడూలేని రీతిలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. చమురు సంస్థల తీరుపై ఆగ్రహోదగ్రులైన బాధితులు గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌ను ముట్టడించి వాహనాలను ధ్వంసం చేశారు. పరామర్శకు వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పలను చుట్టుముట్టి చమురు సంస్థల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
 
కోనసీమలో 1993లో కొమరాడ..1995లో దేవర్లంక.. 1996లో దేవరపల్లి, 2005లో తాండవపల్లిలో బ్లో అవుట్లు సంభవించాయి. వీటిలో దేవర్లంక బ్లో అవుట్ రెండు నెలల పాటు ప్రజ్వరిల్లింది. ఈ ఘటనల్లో పచ్చని పొలాలు మాడిమసైపోయాయి. కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గయింది. ఇక పరిపాటిగా మారిన పైపులైన్ల లీకేజ్‌లతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్ని ఘటనలు జరిగినా ఇప్పటి వరకూ ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం  లేదు. శుక్రవారం నాటి ఘటన కోనసీమలో చమురు కార్యకలాపాల చరిత్రలోనే తొలిసారి 15 ప్రాణాలను బలిగొంది.
 
అధికారుల నిర్లక్ష్యానికి అమాయక ప్రాణాలే మూల్యం..
 గెయిల్ నుంచి విజయవాడ ల్యాంకో విద్యుత్ ప్రాజెక్టుకు గ్యాస్ సరఫరా చేసే ట్రంక్ పైపులైన్ ఉదయం 5.10 గంటల సమయంలో పేలిపోయింది. నగరం సమీపంలో వాడ్రేవుపల్లి మీడియం డ్రైన్‌ను ఆనుకుని పైపులైన్ జాయింట్ వద్ద జరిగిన ఈ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టించింది. పైపులైన్ పేలడంతో ఎగసిపడిన గ్యాస్ ఆ ప్రాంతమంతా ఆవరించింది.

నిద్రలో ఉన్న జనం ఏం జరిగిందో గ్రహించేలోపే అగ్నికీలలు విరుచుకు పడ్డాయి. జాయింట్ వద్ద పైపులైన్‌లీకైన సమయంలో గ్యాస్ మాత్రమే ఎగజిమ్మిందని, వరుసగా రెండుసార్లు సంభవించిన పేలుడుతో గ్యాస్ రాపిడికి గురై మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కాగా లీకైన గ్యాస్ ఎగజిమ్ముతూ, పరిసరాల్లో కమ్ముకుంటున్న సమయంలోనే స్థానికులెవరో పొయ్యి వెలిగించడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. పేలుడుతో మంటలు బ్లో అవుట్ సంభవించినప్పటిలా 30 నుంచి 40 మీటర్ల ఎత్తున ఎగసి పడ్డాయి.

మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పైపులైన్ లీకైనా అధికారులు మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టడంతో.. అందుకు మూల్యాన్ని అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. పేలుడు ధాటికి పది అడుగుల గొయ్యి ఏర్పడగా పైపులైన్‌పై కప్పిన గ్రావెల్ 200 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడింది. పదికి పైగా అగ్నిమాపక శకటాలు సుమారు మూడు గంటల పాటు శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చినా.. రాత్రి వరకూ భూమి లోంచి పొగలు, వేడిగాలులు  వస్తూనే ఉన్నాయి. అధికారులు స్పందించకపోయినా గ్రామస్తులే సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు. మంటలను అదుపు చేయడంతో పాటు మృతులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో చురుగ్గా పాల్గొన్నారు.
 
క్షతగాత్రుల ఆర్తనాదాలు..
కోనసీమ చవి చూసిన పెనువిషాదాల్లో ఒకటి అనదగ్గ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 15 మందిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీల్లేని రీతిలో మాంసపుముద్దల్లా మిగిలారు. మరో 27మంది వరకు గాయాల పాలవగా, వారిలో 15 మంది  చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వారిని తొలుత అమలాపురం ఏరియా, కిమ్స్ ఆస్పత్రులకు తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ అపోలో, ట్రస్ట్, సేఫ్ ఆస్పత్రులకు తరలించారు.

కాకినాడలో 11 మంది, రాజమండ్రిలో ఇద్దరు, అమలాపురం కిమ్స్‌లో ఏడుగురు, రాజోలులో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు హాహాకారాలతో ఆస్పత్రులు దద్దరిల్లిపోతున్నాయి. బాధ భరించలేక ‘మమ్మల్ని చంపేయండి’ అని వైద్యులకు మొర పెట్టుకుంటుంటే చూసేవారికి గుండెల్ని పిండినట్టయింది.
 శ్మశానాన్ని తలపించిన ఘటనాస్థలి
 
పేలుడు జరిగిన ప్రాంతం ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలతో శ్మశానాన్ని తలపించింది. అగ్ని కీలల్లో దగ్ధమై, మాంసపుముద్దల్లా మిగిలిన మృతులు, మాడి మోడుల్లా మిగిలిన కొబ్బరిచెట్లు, మంటల్లో చిక్కుకొని బూడిదైన పక్షులు.. ఏ వైపు చూసినా కన్ను తట్టుకోలేని బీభత్సమే.. గుండె భరించలేని విధ్వంసమే. ఈ ఘటనలో క పది కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా. 12 ఇళ్లు, మండల వ్యవసాయశాఖ కార్యాలయం, ఒక షాపింగ్ కాంప్లెక్స్ అగ్నికి ఆహుతయ్యాయి.

15 ఎకరాల్లో కొబ్బరి తోటలు మాడిమసైపోయాయి. ఓఎన్జీసీ మినీ రిఫైనరీ, ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటరు (జీసీఎస్), గెయిల్ కార్యాలయాలు సమీపంలో ఉండడంతో పైపులైన్ ప్రారంభంలో ఈ ఘటన జరిగి ఉంటే ఊహకందనంత పెను విధ్వంసమే జరిగేది. పేలుడు ప్రాంతానికి చేరువలోనే మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. దుర్ఘటన పగటిపూట జరిగి ఉంటే వందల్లో ప్రాణ నష్టం ఉండేదని స్థానికులు అంటున్నారు.

ఉదయం 5.10 గంటలకు ఘటన జరిగితే గంటన్నర వరకూ పోలీసులు మినహా అధికారులెవరూ కన్నెత్తై చూడలేదు. ఆరున్నరకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగసిపడే మంటలను అదుపు చేసేందుకు సాహసం చేయలేకపోయారు. ఒకటి తర్వాత మరొకటిగా ప్రభుత్వ అగ్నిమాపక శకటాలతో పాటు గెయిల్, రిలయన్స్, రవ్వ, కెయిర్న్ ఎనర్జీ, జీఎస్పీసీలకు చెందిన పది శకటాలు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. కాగా పేలుడుపై కేసు నమోదు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు. భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
 
సీఎం డౌన్..డౌన్
గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా ప్రాణ, ఆస్తినష్టాలకు కారణమైన ఓఎన్జీసీ, జీసీఎస్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్ర హోదగ్రులయ్యారు. వందల మంది  జీసీఎస్ మెయిన్ గేట్‌ను చుట్టుముట్టి గ్యాస్ కలెక్షన్ సెంటర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆ సంస్థ సిబ్బంది వాహనాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రతో కలిసి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘సీఎం డౌన్ డౌన్..ఓఎన్జీసీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం వారిని సముదాయించి దుర్ఘటనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ జరిపించి దుర్ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పరామర్శించేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌లకు బాధితులు తమ గోడు వినిపించారు.  దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
 
నగరంలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ
కోటగుమ్మం (రాజమండ్రి) : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైపులైన్ పేలుడుతో దగ్ధమైన విద్యుత్ లైన్లను పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్ ఎస్‌ఈ (ఆపరేషన్స్) ఎన్. గంగాధర్ తెలిపారు. ఈ సంఘటనలో 49 హౌస్ సర్వీసులు, 9 హెచ్‌టీ, ఎల్‌టీ స్తంభాలు, ఒక ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయాయన్నారు. ఇళ్ల సర్వీసులు ఎవరికి వారే వేసుకోవలసి ఉన్నా మానవతా దృక్పథంతో పునరుద్ధరించడంతో పాటు కొత్త స్తంభాలు వేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement