అక్టోబర్ నుంచి మద్యం అవుట్‌లెట్‌లు | From October to alcohol outlets | Sakshi
Sakshi News home page

అక్టోబర్ నుంచి మద్యం అవుట్‌లెట్‌లు

Published Fri, Sep 5 2014 3:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

From October to alcohol outlets

నెల్లూరు(క్రైమ్): ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) ఆధ్వర్యంలో అక్టోబర్ నుంచి జిల్లాలో మద్యం అవుట్‌లెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని సంబంధిత డిపో మేనేజర్లు పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించి ఈనెల 15 లోపు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు సమాచారం. ఖాళీగా ఉ న్న మద్యం దుకాణాల స్థానంలో రిటైల్ అవుట్‌లెట్‌లు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఇటీవల జీఓ ఎంఎస్ నంబర్ 292ను జారీ చేసింది. జిల్లా లో 348 మద్యం దుకాణాలకు నాలుగు విడతలుగా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 338 దుకాణాలను లాటరీలో వ్యాపారులు దక్కించుకున్నారు. పది దుకాణాలు (నెల్లూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో ఒకటి, గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో తొమ్మిది) సొంతం చేసుకునేందుకు వ్యాపారులు ముం దుకు రాలేదు. దీంతో అవి ఖాళీగా ఉన్నాయి. వీటి స్థానంలో తమిళనాడులో తరహాలో రిటైల్ అవుట్‌లెట్‌లు ఏర్పాటు కానున్నాయి.
 
 ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు
 ఓవైపు 2014-15 మద్యం పాలసీ ప్రకారం ఎమ్మార్పీకే మద్యం విక్రయించాల్సి  ఉంది. జిల్లాలో ఎమ్మార్పీ నామమాత్రంగా అమలు అవుతోంది. మద్యం వ్యాపారులు సిండికేట్ అయి పలుచోట్ల మద్యం బాటిల్‌పై ఎమ్మార్పీ కంటే రూ. 10 నుంచి రూ.15 వరకు అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. త్వరలో ఏర్పాటు కానున్న రిటైల్ మద్యం దుకాణాల్లో కచ్చితంగా ఎమ్మార్పీకే మద్యం అందుబాటులోకి రానుంది.  
 
 ఏర్పాటు ఇలా..: రిటైల్ అవుట్‌లెట్ ఏర్పాటుకు అనువైన దుకాణం కలిగి, అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. అవుట్‌లెట్ ఖరారైతే యజమానులకు ఏపీబీసీఎల్ ద్వారా మూడునెలల అద్దెను అడ్వాన్సుగా చెల్లించడంతో పాటు  2015 జూన్ వరకు యజమానులతో ఒప్పందం చేసుకుంటారు. అవసరమైతే మరో ఏడాది రెన్యువల్ చేసుకునేలా ముం దస్తు అంగీకారం చేసుకుంటారు. ఒక్కో అవుట్‌లెట్‌లో విక్రయాలు, పర్యవేక్షణకు సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్లను  2015 జూన్ వరకు  కాంట్రాక్టు పద్ధతిపై  నియమించనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పాసైన జిల్లాకు చెందిన వారు  దరఖాస్తు చేసుకోవాలి.  సూపర్‌వైజర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు రూ. లక్ష, సేల్స్‌మెన్ అభ్యర్థులు రూ. 50 వేలు చొ ప్పున బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది.   
 
 ఎంపిక ఇలా..: ఒక్కో అవుట్‌లెట్‌కు ముగ్గురు సిబ్బందిని నియమిస్తారు. ఒక సూపర్‌వైజర్‌తో పాటు మరో ఇద్దరు సేల్స్‌మెన్లు ఉంటారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 అవుట్‌లెట్లలో పనిచేసేందుకు 30 మందిని ఎంపికచేస్తారు. ఇంటర్మీడియట్, పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. సూపర్‌వైజర్‌కు రూ. 9వేలు, సేల్స్‌మెన్‌కు రూ.7,700 చొప్పున నెలవారీ జీతం అందిస్తారు. 62ఏళ్ల లోపు ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, 40 ఏళ్లలోపు ఉన్న సాధారణ వ్యక్తులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement