జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు విద్యార్థులు అరగంట ముందే ....
విద్యార్థులకు డీఈవో సూచన
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
విజయవాడ : జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు విద్యార్థులు అరగంట ముందే సెంటర్‌కు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి సూచించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, తొమ్మిది గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామని తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడుతూ పరీక్షల ఏర్పాట్లను వివరించారు. పరీక్షకు అరగంట ఆలస్యంగా అంటే 10 గంటల వరకు వచ్చినా విద్యార్థులను అనుమతిస్తామని, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు.
ముందే వచ్చి పరీక్ష ప్రశాంతంగా రాసేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లన్నింటికీ ప్రశ్న పత్రాలు పంపించామని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి బెంచ్‌పైనే కూర్చొని పరీక్ష రాస్తారని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్‌ను పరిశీలించామన్నారు. మంచినీరు, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.