సాక్షి ప్రతినిధి, విజయనగరం : మండల సమాఖ్యలు, గ్రామైక్య సంఘాల బలోపేతం కోసం 2000-2001లో ప్రపంచ బ్యాంకు సాయంతో కేంద్రప్రభుత్వం రూ. 30.7కోట్ల సామాజిక పెట్టుబడి నిధిని డీఆర్‌డీఏకు విడుదల చేసింది. వీటిని సాధారణ వడ్డీకి గ్రామైక్యసంఘాలకు రుణాలివ్వాలని, రుణం తీసుకున్న సంఘాలు తిరిగి 100 వాయిదాల్లో ప్రతీ నెలా మండల సమాఖ్యలకు వడ్డీతో కలిపి చెల్లించాలని కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
దీనివల్ల స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా రుణాలపై వచ్చే వడ్డీతో మండల సమాఖ్యలు నిర్వహించుకోవాలన్నది లక్ష్యం. కానీ జిల్లాలో సామాజిక పెట్టుబడి నిధి లక్ష్యం నెరవేరలేదని తెలుస్తోంది. కొంత సొమ్మును వేరే అవసరాలకు సర్ధుబాటు చేయగా, మరికొంత సొమ్మును కొం దరు సిబ్బంది, అధ్యక్షులుగా చెప్పుకునే కొందరు కుమ్మక్కై స్వాహా చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
తేలని రికవరీ లెక్కలు
కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ. 30.7కోట్లు 1100గ్రామైక్య సంఘాలకు రుణాలుగా అందించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కానీ వాటికి సంబంధించిన కచ్చితమైన రికార్డుల్లేవు. ఇప్పటివరకు రూ. 6కోట్లవరకు రికవరీ జరిగినట్టు మాత్రమే చెబుతున్నారు. వడ్డీతో కలిపి ఇంకా రూ. 29.13కోట్ల మేరకు రావల్సి ఉందని చెబుతున్నారు. ఇందులోనూ వాస్తవాలు కనిపించడంలేదు. చాలా వరకు సంఘాలకు రుణం సొమ్ము వెళ్లకుండా మధ్యలోనే స్వాహా అయిపోయిందని, ఆ కారణంగానే ఇంతవరకు రికవరీ జరగలేదని తెలుస్తోంది. సంఘం సభ్యులకు తెలియకుండా అధ్యక్షులు, సిబ్బంది కుమ్మక్కై పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా గ్రామైక్య సంఘాలకు ఇచ్చినట్టయితే ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేవి. రికవరీ కన్పించేది. దీనికి సంబంధించి స్పష్టమైన లెక్కలు లేకపోవడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది.
వసూలైన రూ. 10కోట్లు వేరేవాటికి సర్దుబాటు
సక్రమంగా లావాదేవీలు జరిగిన సంఘాల నుంచి వసూలైన నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా వేరే అవసరాలకు సర్దుబాటు చేశారు. సుమారు రూ. 10కోట్ల వరకు స్వయం సహాయక సంఘాల సభ్యుల ఇన్సూరెన్స్ ప్రీమియం కింద మళ్లించారు. వాస్తవానికైతే, స్వయం సహాయక సంఘాల నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం వసూలు చేసి కట్టాలి.
కానీ, నాటి డీఆర్‌డీఏ అధికారులు గొప్పకు పోయి స్వయం సహాయక సంఘాల సభ్యులందరి నుంచి ప్రీమియం వసూలు చేసినట్టు చూపించి, సామాజిక పెట్టుబడి నిధి నుంచి రూ. 10కోట్లు వేరు చేసి కట్టేశారు. ఆ తర్వాత తీరికగా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంను చాలా వరకు సంఘాల సభ్యులనుంచి వసూలు చేసినట్టు తెలిసింది. కానీ, రికార్డుల్లో మాత్రం అదేదీ చూపించలేదు. ఆ ప్రీమియం ఇంకా వసూలు చేయాల్సి ఉందని సంబంధిత ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ వసూళ్లలోనూ స్వాహా జరిగిందన్న వాదనలు ఉన్నాయి. మొత్తమ్మీద మళ్లింపు, రుణబకాయిల కింద మండల సమాఖ్యలకు రావాల్సిన రూ. 30కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు.
ఆర్థిక వెతల్లో సమాఖ్యలు
అటు అసలు, ఇటు వడ్డీ రాకపోవడంతో మండల సమాఖ్యలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రతీ మండల సమాఖ్యలో ఒక అకౌంటెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. వారి జీతాలు, కార్యాలయ విద్యుత్‌బిల్లు మండల సమాఖ్యలే చెల్లించాలి. ఇలా ప్రతీ నెలా రూ. 20వేలకు పైబడి ఖర్చు ఉంటుంది. ఇదంతా సామాజిక పెట్టుబడి నిధి వడ్డీ నుంచే వెచ్చించాలి. గ్రామైక్య సంఘాల నుంచి రికవరీ లేకపోవడంతో ఇప్పుడా ఖర్చులు భరించలేని స్థితిలో మండల సమాఖ్యలున్నాయి.
నిధులు గోల్‌మాల్?
Published Sat, Jul 9 2016 11:34 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement