కామధేను నిధులకు కన్నం
మరమ్మతుల పేరుతో నిధుల స్వాహాకు యత్నం నాణ్యతపై పట్టించుకోని అధికారులు
ఉదయగిరి: కొండాపురం మండలం చింతలదేవి పశుక్షేత్రంలో ఏర్పాటుచేయనున్న కామధేను ప్రాజెక్టు పనుల్లో అవినీతిచోటు చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను దేశానికి రెండు మంజూరుచేయగా, వాటిలో ఒకటి చింతలదేవికి వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి మెట్ట ప్రాంతవాసులతో పాటు జిల్లాలోని పశుగణాభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు మంజూరవుతున్న నేపథ్యంలో వాటిని కాజేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులతో జరుగుతున్న పనుల్లో వీలైనంత మేర దుర్వినియోగానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూ.91 లక్షల కేటాయింపు
కామధేను ప్రాజెక్టు కింద ముందుగా రూ.91 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో డిప్యూటీ డెరైక్టర్ కార్యాలయం, వైద్యుల వసతి గృహాలు, 4వ తరగతి ఉద్యోగులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆరు భవనాలు నిర్మించాలని భావించి రూ.91 లక్షలకు టెండర్లు నిర్వహించారు. పాత భవనాల పైకప్పులు తీసివేసి వాటికి శ్లాబులు వేసి ఆధునికీకరించే విధంగా డిజైన్ చేశారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ భవనాలు ఇరుగ్గా ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండానే ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు పెంచి పాత వాటికే మరమ్మతులు చేసే విధంగా రూపకల్పన చేయడంపై విమర్శలున్నాయి.
నాణ్యతలో డొల్ల
ఇప్పటికే పాత భవనాల పైకప్పులు తీసి శ్లాబు వేసే క్రమంలో నాణ్యతకు నీళ్లొదిలారు. పెన్నా నదినుంచి తెచ్చిన ఇసుకను ఉపయోగించాల్సివుండగా, స్థానికంగా వంకలు, వాగుల్లో దొరికే నాసిరకం ఇసుకను ఉపయోగిస్తున్నారు. దీంతో శ్లాబు ఆయుష్షు ప్రశ్నార్థకంగా మారింది. కాంక్రీటులో కూడా సరైన నాణ్యత పాటించడం లేదనే విమర్శలున్నాయి.
పాత భవనాల మరమ్మతుల్లో మర్మమేమిటో?ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ నిధులతో కొత్త భవనాలు నిర్మించే అవకాశముంది. కానీ పాత భవనాలకు మరమ్మతులు చేయించడం వెనుక కొంతమంది అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తూతూమంత్రంగా పనులు నిర్వహించి ఎక్కువ మొత్తంలో నిధులు కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది.
ప్రాజెక్టు నేపథ్యం: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొండాపురం మండలం చింతలదేవికి కామధేను పునరుత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.11.12 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. గతేడాది మార్చిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 250 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. ఆదిలోనే వివాదాస్పదంఉదయగిరి ప్రాంతానికి ఎంతో మేలు చేస్తుందని భావించిన ఈ ప్రాజెక్టు వ్యవహారం మొదట్లోనే వివాదాస్పదంగా మారింది. కొంతమంది అధికార పార్టీనేతలు ఈ ప్రాజెక్టును తమకు కామధేనువుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నిధులు వస్తుండడంతో వాటిపై కన్నేసి కన్నం వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జిల్లాకు మారుమూలన ఈ ప్రాజెక్టు ఉండటంతో దీనిపై జిల్లా అధికారులు పెద్దగా శ్రద్ద వహించకపోవడంతో అభివృద్ధి పనుల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్, బోర్ల తవ్వకంలో అవినీతి చోటుచేసుకున్నట్లు విమర్శలున్నాయి.