మురుగు ఇక పరుగు | Funds Release For Drainage System Works in YSR Kadapa | Sakshi
Sakshi News home page

మురుగు ఇక పరుగు

Published Wed, Jan 29 2020 1:28 PM | Last Updated on Wed, Jan 29 2020 1:28 PM

Funds Release For Drainage System Works in YSR Kadapa - Sakshi

శివాజీనగర్‌లో మొదలు పెట్టిన మట్టి పనులు

కడప ఎడ్యుకేషన్‌: చిన్నపాటి వర్షం కురిసినా గ్రామీణ ప్రాంతాల్లో  మురుగు సమస్య ప్రజలను వేధిస్తోంది. మురుగుపై దోమలు చేరడంతోపాటు దుర్గంధం వెదజల్లడంతో పలువురు రోగాల బారిన పడుతున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం గ్రామాల్లో మురుగు పారుదల వ్యవస్థను సవ్యం చేసేందుకు శ్రీకారం చుట్టింది. కాల్వలను ఏర్పాటు చేసి మురుగు ముందుకు సాగేలా పనులను చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 46 మండలాల్లో 1555 డ్రైనేజీ కాల్వల పనులకుగాను 235.82 కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 1518 పనులను గుర్తించి 229.67 కోట్లు్ల మంజూరు చేసింది. ప్రొద్దుటూరు, సీకేదిన్నె, ఖాజీపేట, రాయచోటితోపాటు పలు మండలాల్లో పనులను మొదలు పెట్టారు.  గ్రామీణ ప్రాంతాలో మురుగు సమస్య  పరిష్కారమవుతోందని జనం సంతోషిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా...
జిల్లాలో 790 గ్రామ పంచాయతీలలో  20 లక్షల జనాభా నివసిస్తున్నారు. పెద్దపెద్ద గ్రామాల్లో, అధిక జనాభా ఉన్న  గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ మిగతా గ్రామాల్లో మురుగు ముందుకు పోయే దారిలేదు. చిన్నపాటి వర్షం వచ్చినా వర్షపు నీరంతా నిలబడిపోతోంది. రోడ్లపై మురుగుతో కలిసి నిల్వగా మారుతోంది. దుర్గంధం వెదజల్లడంతోపాటు దోమలు పెరిగి రోగాలను వృద్ధి చేస్తున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి చాలా గ్రామాల్లో సిమెంట్‌  రోడ్లు నిర్మించారు. కానీ మురుగు కాల్వలు మాత్రం నిర్మించలేదు. పలుమార్లు ప్రజలు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తాజాగా ఈ సమస్యకు శాశ్వత చెక్‌ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది.  

మురుగు కాల్వలపై కప్పులు
జిల్లాలోని కొన్ని గ్రామాల్లో మురుగుకాల్వలు నిర్మించినా నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా కాల్వల్లో మట్టితోపాటు చెత్తాచెదారం పేరుకుపోతోంది. కాల్వలు మూసుకుపోతున్నాయి.మురుగు ముందుకు వెళ్లే దారి లేకుండా పోతోంది.  మురుగంతా కాల్వలో నిల్వ ఉంటూ దుర్గంధం వెదజల్లుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ప్రస్తుతం నిర్మించనున్న మురుగుకాల్వల పైన కప్పులను కచ్చితంగా వేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  

ఉపాధిహామీ, స్వచ్చభారత్‌మిషన్‌ నిధులతో...
ఉపాధిహామీలో 90 శాతం నిధులతోపాటు స్వచ్చభారత్‌ మిషన్‌ 10 శాతం నిధులతో  మురుగుకాల్వల పనులను మొదలు పెట్టారు.  పది నియోజక వర్గాలలోని 1555 పనులలో ప్రస్తుతం  1518 పనులను అన్‌ౖలైన్‌లో అనుమతులు లబించాయి. వీటికి 229.63 కోట్లు ఖర్చవుతుంది. ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పలు చోట్ల పనులను ప్రారంభించారు. న్ని చోట్ల మట్టి పనులు జరుగుతుండగా మరికొన్ని చోట్ల సిమెంట్‌లో డ్రైనేజీ పనులను ప్రారంభించారు.  

త్వరగా పూర్తి చేస్తాం..
46 మండలాలకు  డ్రైనేజీ పనులు మంజూరైయ్యాయి. ఇప్పటివరకూ 40 కిపైగా మండలాల్లో పనులు ప్రారంభమైయ్యాయి. మిగతా మండలాల్లో కూడా నాలుగైదు రోజుల్లో పనులను ప్రారంభిస్తాం. మొదలైన పనులను కూడా పర్యవేక్షిస్తున్నాం. వీలైనంత త్వ రగా  పూర్తి చేస్తాం.  – మల్లికార్జునప్ప,ఆర్‌డబ్లూఎస్, ఎస్‌ఈ(ఎఫ్‌ఏసీ) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement