- ఓటరు చేతుల్లో నేతల భవితవ్యం
- ముగిసిన మున్సిపల్ ప్రచారం
- అన్నిచోట్లా వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మధ్యేపోటీ
- 169 వార్డులకు, 50 డివిజన్లకు ఎన్నికలు
- ఆరు మున్సిపాల్టీల్లో వైఎస్‌ఆర్ సీపీ ముందంజ
సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా మార్చి 15వ తేదీ నుంచి సాగిన రెండు వారాల మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, పలమనేరు, నగరి మున్సిపాల్టీలకు మార్చి 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి 48 గంటల ముందే ప్రచారం సమాప్తం కావడంతో వార్డుల్లో నిశ్శబ్దం నెలకొంది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రీఫైనల్ ఎలక్షన్స్ కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఆయా మున్సిపాల్టీల పరిధిలోని వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్‌జ్జలు, ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా వార్డుల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యత భుజానికెత్తుకుని నియోజకవర్గస్థాయి నాయకులు రంగంలోకి దిగారు.
హోరాహోరీగా ప్రచారం సాగిం చారు. అన్ని ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ మాత్రం గల్లంతైంది. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మాత్రమే అన్ని వార్డులకు కాంగ్రెస్ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. మిగిలిన మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సమీప ప్రత్యర్థి టీడీపీ అందుకోలేనంతగా వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు దూసుకెళ్లారు. ఇంటింటా ప్రచారంతోపాటు, ఉద్యోగులు, కార్మికులను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించారు.
చిత్తూరులో పోటాపోటీ
చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త ఎ.ఎస్.మనోహర్, ఆయన భార్య, కుమారుడు వేర్వేరుగా అభ్యర్థుల తరఫున వార్డుల్లో ప్రచారం చేశారు. ముఖ్యంగా చిత్తూరు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని,
డివిజన్లువారీగా ప్రజలు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక సమస్యలపై అజెండాతో ఓట్లు అభ్యర్థించారు. పార్టీ గుర్తు ఫ్యానును ప్రజలు గుర్తుపెట్టుకునేలా పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేసి ప్రచారం సాగించారు.
మున్సిపాల్టీల్లో ప్రచార జోరు
పుంగనూరు మున్సిపాల్టీలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను చేపట్టి వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలో ప్రధానంగా ఎదురవుతున్న నీటి సమస్య, రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మదనపల్లె మున్సిపాల్టీలో తొలి నుంచి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్వయంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు.
ఆయనతోపాటు ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, సమన్వయకర్త షమీమ్‌అస్లాం వార్డుల్లో వైఎస్‌ఆర్ సీపీ గెలుపు కోసం ప్రచారం సాగించారు. సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ నిర్మాణంతోపాటు, పక్కా గృహాలు పేదలకు కట్టిస్తామన్న అజెండాతో ప్రజల్లోకి వెళ్లారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి అన్నివార్డుల్లో అభ్యర్థుల ప్రచారం కోసం తిరిగారు. కౌండిన్య నీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, పలమనేరుకు శాశ్వత ంగా నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ప్రచారం చేశారు.
పుత్తూరు, నగరి మున్సిపాల్టీల్లో ఆర్‌కే రోజా స్వయంగా ఇంటింటికి వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించారు. నగరిలో రంగునీళ్ల కాలుష్యం పరిష్కారం కావాలన్నా, కంపోస్టు యార్డు ఏర్పాటుకు, పన్నులు తగ్గించేందుకు వైఎస్‌ఆర్ సీపీ కృషి చేస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా వైఎస్‌ఆర్ సీపీ చైర్మన్ అభ్యర్థి మిద్దెల హరితో కలిసి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రచారం సాగించారు. 35 వార్డుల్లో ప్రచారం చేశారు. స్థానిక అజెండాలను ప్రచారంలో పెట్టి ఓట్లు అభ్యర్థించారు. వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్.ఎ.రెహమాన్ గెలుపు కోసం శ్రీకాళహస్తిలో ప్రచారం చేశారు.