గద్దె కొత్త కాపురం సాగేనా!
Published Thu, Jan 2 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
చీపురుపల్లి, న్యూస్‌లైన్: చీపురుపల్లి నియోజకవర్గంలో సంఖ్యా బలమున్న ఓ సామాజిక వర్గం గత కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావును వ్యతిరేకిస్తూ వస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన బొత్సను వ్యతిరేకించి, తెలుగుదేశం పార్టీలో ఉండి, గద్దెకు మద్దతిస్తే అలాంటి తమను నాలుగేళ్లుగా వదిలి పెట్టి, ఎక్కడున్నామో పట్టించుకోకుండా, తీరా ఎన్నికల సమయానికి సీటు కోసం వస్తే ఊరుకునేది లేదని ఆ వర్గానికి చెందిన మండల స్థాయి నేతలు హెచ్చరిస్తున్నప్పటికీ గద్దెను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం పై ఆ పార్టీ నాయకులకు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా ఓటర్లు ఉన్న తూర్పుకాపు సామాజి క వర్గానికి ప్రాధాన్యమివ్వాలి తప్ప లాబీయిం గ్‌లకు ప్రాధాన్యమివ్వడం దారుణమని ఆ పార్టీ కి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పలువురు పార్టీని వీడడం ఖాయమని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
గద్దె తెలుగుదేశంలో ప్రస్థానం.....
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి, ఆపార్టీ ప్రతిపక్షంలో ఉంటే పక్కకు తప్పుకోవడం, మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పార్టీలో చేరడం గద్దే బాబూరావుకు అలవాటని దేశం పార్టీ నేత లు విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి వారసత్వం, కుల బలం లేని గద్దె బాబూరావు ను రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేసింది. 1996 నుంచి 2004 వరకు చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మూడోసారి 2004లో జరిగిన ఎన్నికల్లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాల య్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజల కు దూరమయ్యారు.
పలుమార్లు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటనలు చేశారు. 2009లో మరోసారి బొత్సపై 5 వేల ఓట్లు తేడాతో ఓటమి చెందారు. తరువాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పట్లో నియోజకవర్గంలోని కార్యకర్తలంతా.... పార్టీకి రాజీనామా చేయవద్దని, తమను ఆదుకునే వారు ఎవ్వరూ లేరని ప్రాథేయపడ్డారు. వారి విన్నపాలను పట్టించుకోకుం డా తనకు రాజకీయం చేసే ఓపిక లేదని, వయ స్సు మీరిపోయిందని రాజీనామా చేసి, కార్యకర్తలకు దూరమయ్యారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని తెలుగుదేశం మండల స్థాయి క్యాడర్‌పై తన వద్ద డబ్బులు తీసుకుని, తనకు వ్యతిరేకంగా పని చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి....
2009 ఎన్నికలు తరువాత రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న గద్దె తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఆ పార్టీ క్యాడర్ గద్దె రాకను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిననాటి నుంచి తనకే ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అం దుకు ఆ పార్టీ నిరాకరించడంతో పార్టీలో ఉన్న క్యాడర్‌ను తీసుకుని వెళ్లిపోయేందుకు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే పార్టీని వీడేందుకు క్యాడర్ అంగీకరించలేదు. దీంతో ఆయన ఒక్కరే పార్టీకి రాజీనామా చేశారు.
ప్రస్తుత పరిస్థితి....
దాదాపు ఐదేళ్లగా తెలుగుదేశం పార్టీకి దూరం గా ఉండి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధమవడంతో దేశం లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు చెందిన పార్టీ పెద్ద, పొలిట్‌బ్యూరో సభ్యుడు పి.అశోక్‌గజపతిరాజు, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ నెల 3న హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నట్లు స్వయంగా బాబూరావు ప్రకటించారు. తన నివాసం వద్ద, పట్టణంలోని వివిధ సెంటర్ల లో అశోక్, చంద్రబాబు, ఎన్టీఆర్‌ల ఫొటోలు, ఫ్లెక్సీలతో నింపేశారు. అయితే అదే పార్టీలో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కె.త్రిమూర్తులురాజు వర్గానికి ఈ పరిణామం మిం గుడుపడడం లేదు. గద్దె పార్టీని వీడినప్పటి నుంచి కె.త్రిమూర్తులురాజు కార్యకర్తలకు అండగా నిలిచారు. నాలుగేళ్లుగా పార్టీకి వెన్నం టి ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ, చివరకు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఇక తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందనుకుంటున్న తరుణంలో బాబూరావు పార్టీలో చేరుతుండడంతో కేటీఆర్‌కు పోటీ తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతా కష్టపడి పని చేస్తే తమ శ్రమను గుర్తించని అధిష్టానం, పార్టీను కాదని వెళ్లిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటుందంటూ కేటీఆర్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గద్దే పార్టీలో చేరితే ఆయన వ్యతిరేక క్యాడర్ పార్టీకి దూరంకావడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.
Advertisement