
సాక్షి, రాయచోటి/వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేసే ప్రతీ అడుగు ప్రజల కోసమే అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ వంటి నాయకుడితో కలిసి పనిచేయడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ రాయచోటి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం జగన్‌ది ఉక్కు సంకల్పం అని వ్యాఖ్యానించారు. ‘రైతులకు అండగా నిలిచారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించారు. రూ. 23 కోట్లతో వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. రాయచోటి పట్టణాభివృద్ధికి రూ. 340 కోట్లు కేటాయించారు. మహిళ భద్రత కోసం దిశ చట్టం తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. సీఎం జగన్ వేసే ప్రతీ అడుగు ప్రజలకోసమే’ అని ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.
నేనున్నానని హామీ ఇచ్చి..
రాయచోటి వెనుకబడిన ప్రాంతమని.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు.. ‘రాయచోటి నేనున్నా’ అని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు గాలేరు- నగరి నీటి తరలింపునకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని తెలిపారు.
శాశ్వత సీఎం జగనన్నే..
గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు... సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆనాడు ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే మొన్నటి వరదల్లో అదనంగా 50 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రాయచోటి అభివృద్ధికి రూ. 2 వేల కోట్లతో శంకుస్థాపన చేశారని తెలిపారు. చంద్రబాబు మరో జన్మ ఎత్తినా ముఖ్యమంత్రి కాలేరని.. ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి జగనన్నే అని అనిల్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment