గాలి ఒక్కరే నామినేషన్
ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు
19న లాంఛనంగా ప్రకటించనున్న ఎన్నికల అధికారి
తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈనెల 19 తేదీన ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు లాంఛనంగా ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త ప్రకటించనున్నారు. 12వ తేదీన జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులతో కలసి గాలి ముద్దుకృష్ణమనాయుడు తొలుత మూడు సెట్ల నామినేషన్ ఫారాలను సమర్పించారు. మళ్లీ 15వతేదీ సోమవారం ఒక సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈయన ఒక్కరే మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీకి అభ్యర్థిని నిలుపలేదు.
దీంతో గాలి ముద్దుకృష్ణమనాయుడుకు మార్గం సుగమమైంది. బి.కొత్తకోటకు చెందిన ఓ టీడీపీ నేత పార్టీపై అసంతృప్తితో నామినేషన్ వేసేందుకు వస్తే గాలి అనుచరులు మేనేజ్ చేసినట్టు సమాచారం. సదుం మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడు కూడా స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జిపై కోపంతో ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చారు. కలెక్టరేట్ ప్రాంతంలోని కాపుకాసిన తెలుగుదేశం నేతలు అతన్ని నామినేషన్ వేయకుండా బుజ్జగించినట్టు తెలుస్తోంది.
మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లికి చెందిన ఓ నేత కూడా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించడంతో టీడీపీ నేతలు సర్ది చెప్పి మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాని, తిరుపతి టౌన్ బ్యాంకు అధ్యక్షుడు పులుగోరు మురళి, గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్న కుమారుడు చినబాబు చిత్తూరు కలెక్టరేట్‌లోనే ఉండి ఎవరూ నామినేషన్‌ను వేయకుండా తెరవెనుక ప్రయత్నాలు చేశారు.