టీడీపీలో చేరిన గల్లా అరుణ
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడైన పారిశ్రామికవేత్త గల్లా జయదే వ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ఏ రహ్మాన్ (విశాఖ), దేవిశెట్టి మల్లికార్జునరావు (రేపల్లె), మాజీ ఎంపీ గునిపాటి రామయ్య (రాజంపేట), టీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఇద్దరు నేతలు శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఎద్దేవా చేశారు. తరతరాలుగా ఆ పార్టీలో ఉన్నవారు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. ఏడున్నర దశాబ్దాలుగా తాము సొంత ఇమేజ్‌తోనే రాజకీయం చేశామని, సినీ గ్లామర్‌ను నమ్ముకోలేదని గల్లా అరుణకుమారి చెప్పారు.
సినీ నటుడు కృష్ణ కుటుంబంతో బంధుత్వం ఉన్నప్పటికీ ప్రచారం చేయాల్సిందిగా వారిపై ఒత్తిడి చేయదలచుకోలేదన్నారు. కాగా, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ శనివారం రాత్రి చంద్రబాబును కలిశారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఆర్.గాంధీ ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరటంతో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు కుతూహలమ్మను పార్టీలో చేర్చుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియమితులయ్యారు.