సాక్షి ప్రతినిధి, గుంటూరు
గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా జయ దేవ్ నిత్యం పార్టీ నేతల మధ్య జరుగుతున్న వర్గ విభేదాలపై ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ సీట్లను అధినేత చంద్రబాబు ఇంకా ఖరారు చేయకపోవడం, కొన్ని నియోజకవర్గాలకు కొత్త నేతల పేర్లు తెరపైకి వస్తుండడమే దీనికి కారణం.
సీట్లు ఆశిస్తున్న నేతలు గల్లాను ఆశ్రయిస్తూ తమకు టికెట్ వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు. కొన్ని నియోజకవర్గాలకు కొత్త నేతల పేర్లు తెరపైకి వస్తుండడంతో స్థానికులు, సీనియర్లు ఆందోళన చెందుతూ గల్లా వద్ద పంచాయితీ పెడుతున్నారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తొలిగా ఆయనకు స్వాగతం పలికే విషయంలో ఇద్దరు నేతలు ఘర్షణకు దిగారు. ఆ తరువాత నుంచి రోజూ ఎక్కడో ఒక చోట నేతలు వివాదానికి దిగుతూ వాటి పరిష్కారానికి గల్లా వద్దకు వస్తున్నారు. ఈ పంచాయితీలను తీర్చలేక సతమతమవుతున్నారు.సీట్లు ఖరారు కాక ముందే నియోజక వర్గానికి ఎందుకు వచ్చానా అని సన్నిహితుల వద్ద మదనపడుతున్నట్టు తెలిసింది.
పార్టీ తరఫున పనిచేయడానికి కొన్ని సౌకర్యాలు కల్పించాలని కొందరు గొంతెమ్మ కోర్కెలతో కార్యాలయానికి వస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే అయినప్పటికీ ఇక్కడి పరిస్థితులకు ఆయన బిత్తరపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
నిత్యం ఏదో వివాదం.: గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు ఇటీవల పెరిగాయి. జిల్లాకు తొలిసారిగా వచ్చిన సందర్భంగా గల్లాకు స్వాగతం పలికే విషయంలో తూర్పు ఇన్‌చార్జి జియావుద్దీన్, ఇటీవలనే పార్టీలో చేరిన షేక్ ఆల్తాఫ్‌ల మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకున్నది.
అది మొదలు నిత్యం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏదో ఒక చోట వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇక పశ్చిమ సీటు తులసీ సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభుకు ఖరారు కానున్నదని, తెలియడంతో అక్కడ టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు మంగళవారం ఆందోళన చేపట్టారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా కొత్తవారికి సీటు ఇస్తే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహనర్‌రావు ఎదుట పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఆ సమయంలో గల్లా అక్కడే ఉన్నా నాయకులను నిలువరించకుండా పరిస్థితులను పరిశీలించారు. బుధవారం మరి కొందరు నేతలు పశ్చిమ సీటు కేటాయింపులో పనిచేసిన వారికి అన్యాయం జరిగితే రాజీనామాలు చేస్తామని నేతలను హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నా, తాడికొండ నియోజకవర్గంలో రాయపాటి వర్గాన్ని అక్కడి టీడీపీ నేతలు కలుపుకునేందుకు అంగీకరించడం లేదు.
పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గల్లా అభ్యర్థిత్వాన్ని అక్కడి టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక స్థానికేతరుడైన గల్లాకు సీటు ఇవ్వడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పలువురు కమ్మ సామాజిక వర్గం నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు.
కొందరు నేతలు తమకు నియోజకవర్గాల్లో పలుకుబడి ఉందని, పార్టీ కోసం పనిచేస్తామని చెబుతూ అందుకు గొంతెమ్మకోర్కెలు ప్రతిపాదిస్తున్నారు.ఇలా రోజుకో సమస్య వస్తుండటంతో గల్లా కలవరం చెందుతున్నారని పార్టీనేతలే చెబుతున్నారు.