జిల్లాలో దొంగలముఠా! | Gang Leader in Vizianagaram | Sakshi
Sakshi News home page

జిల్లాలో దొంగలముఠా!

Published Wed, Jan 29 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

Gang Leader in Vizianagaram

విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ :జిల్లాలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. రోజూ ఏదో ఒక ప్రదేశంలో దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సుమారు రెండు నెలలపాటు దొంగతనాలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.  సంక్రాంతి పండగ నేపథ్యంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని భావించారు. సంక్రాంతి పండగలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో దొంగల ఆటలు సాగలేదు. అయితే, ఊహించని విధంగా ఈ నెల 22 నుంచి దొంగలు వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ముఠా దిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 24న రాత్రి చీపురుపల్లి, కొమరాడ, బలిజిపేట, పార్వతీపురం మండలం కొత్తవలస తదితర ప్రాంతాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. బంగారం, వెండి వస్తువులతోపాటు, నగదును అపహరించారు.
 
 వాహనదారులూ.. బహుపరాక్
 పట్టణంలోని ఇందిరానగర్‌లో ఈ నెల 20 నుంచి వరుసగా మూడు రోజులపాటు మూడు బైకులు చోరీకి గురయ్యాయి. బయటన పార్కింగ్ చేసిన వాహనాలను మారుతాళాలతో తీసి అపహరిస్తున్నారు. 23న సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్న ఎన్.వెంకటరావు తన ద్విచక్రవాహనాన్ని కార్యాలయంలో పార్కింగ్ చేయగా.. దొంగలు పట్టపగలే తస్కరించారు. వీరే బైకులపై బృందాలుగా విడిపోయి చీపురుపల్లి, బలిజిపేట, కొమరాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 25న రాత్రి ఇందిరానగర్‌లో ఒక బైకు మాయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. దొంగలు దేవాలయాలను కూడా వదలడం లేదు. ఇది కూడా ఒక ప్రత్యేక ముఠా పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలిజిపేట ప్రాంతంలో ఈ నెల 24న రాత్రి మూడు దేవాలయాల్లో దొంగతనం జరిగిన తీరు దీనికి నిదర్శనం. గతంలో జమ్ము, నారాయణపురం, పట్టణంలోని హకుంపేట తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో జరిగే దొంగతనాలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి. 
 
 జిల్లాలో తిరుగుతున్న దొంగల ముఠా..?
 జిల్లాలో చోరీలకు పాల్పడే ప్రత్యేక ముఠాలు తిరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వరుసగా బైకులు మాయమవ్వడంతో ప్రత్యేక ముఠాలు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వాహనదారులు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement