‘గంగ' విడుము నాథా!
రబీ ప్రారంభమై నెలరోజులైంది. రైతాంగం కోటి ఆశలతో సాగుకు సమాయత్తమవుతోంది. గడ్డు పరిస్థితులకు ఎదురొడ్డి విత్తనాలు సమకూర్చుకుంది. నారుమళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంది. సాగునీటి కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తోంది. ఇంత ఆరాటపడుతున్నా ఫలితం మాత్రం శూన్యం. కారణం.. ఆయకట్టు భూములకు జీవం పోయాల్సిన స్వర్ణముఖి రిజర్వాయర్ వెలవెలబోతోంది. మూడు మండలాలు.. దాదాపు పదివేల ఎకరాల ఆయకట్టు ఆధారంగా ఉన్న వందలాది మంది రైతుల ఆశలను అడియాస చేస్తోంది.
వాకాడు:
స్వర్ణముఖి నది బ్యారేజి వద్ద రిజర్వాయరు కళ తప్పింది. నిండా నీటితో గలగలలాడాల్సిన బ్యారేజి ఇప్పుడీస్థితిలో ఉండడాన్ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా రిజర్వాయర్‌లో వరద నీరు చేరక పచ్చిక బయలుగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి 35 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఈ రిజర్వాయరును నిర్మించారు. అయితే స్వర్ణముఖి బ్యారేజి రైతుల వరప్రసాదినిగా మారుతుందన్న అన్నదాతల ఆశలు ఈ ఏడాది కూడా అడియాసలే అయ్యాయి.
రబీ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా బ్యారేజీలో చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. కేవలం బ్యారేజీని నమ్ముకుని వాకాడు, చిట్టమూరు, కోట మండలాల్లో 10 వేల ఎకరాల మేర రైతులు పంటలను సాగుచేస్తుంటారు. రిజర్వాయరులో చుక్కనీరు లేకపోవటంతో ఇప్పుడు వారు కంటతడి పెడుతున్నారు. వాకాడు, నెల్లిపూడి వెంకటరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన గేదెలకు మేతకు అనువుగా ఉండటంతో ఎక్కువ మంది స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాలకు గేదెలను తరలించి అక్కడే మేపుతున్నారు.
కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు ఈ బ్యారేజి నుంచి పంట పొలాలకు పూర్తి స్థాయిలో సాగు నీరందించి ఆదుకునేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేసి 2007లో రైతులకు అంకితం చేశారు. అయితే పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్యారేజీలో సాగునీరు నిల్వ ఉండేందుకు గేట్లు ఎత్తు పెంచాలని అప్పటి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఫలితంగా వరద నీరంతా సముద్రంలో చేరుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని స్వర్ణముఖి బ్యారేజీకి తెలుగుగంగ జలాలను విడుదల చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.