ఇక సాగునీటి వంతు
ఇక సాగునీటి వంతు
Published Thu, Jan 12 2017 1:59 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
భీమవరం : జిల్లాలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది దాళ్వాలోనూ వంతులవారీ విధానం అమలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్ర«ధానంగా డెల్టా ప్రాంతంలోని యలమంచిలి, పాలకొల్లు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సాగునీటి ఇబ్బందుల కారణంగా ఇప్పటివరకు 70 శాతం విస్తీర్ణంలో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. ఉండి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 75 శాతం వరకు నాట్లు పడ్డాయి. ఇప్పటివరకు పాలకొల్లు మండలంలో 60 శాతం మాత్రమే నాట్లు పూర్తవగా, పోడూరు మండలంలో 80 శాతం, ఆచంట మండలంలో 70 శాతం, భీమవరం వ్యవసాయ డివిజన్ పరిధిలోని వీరవాసరం, భీమవరం, పాలకోడేరు మండలాల్లో 80 శాతం నాట్లు పూర్తయినట్టు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జనవరి మొదటి వారానికే నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు విస్తృత ప్రచారం చేశారు. ఈ నెలాఖరు నాటికి గాని పూర్తిస్థాయిలో ఊడ్పులు అయ్యే అవకాశం లేదు.
5,100 క్యూసెక్కులతో సరి
డెల్టాకు రోజూ 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే సాగు సజావుగా సాగిపోతుంది. నీటి కొరత ఉండటంతో ప్రస్తుతం 5,100 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. దీనివల్ల శివారు ప్రాంతాలకు నీరందటం లేదు. సాగునీటికి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నా శివారు భూములకు సక్రమంగా అందటం లేదని రైతులు చెబుతున్నారు. తొలి దశలోనే పరిస్థితి ఇలా ఉంటే కీలకమైన సమయాల్లో సాగునీటి పంపిణీ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
గోదావరిలో లభ్యత 10 వేల క్యూసెక్కులే
ప్రస్తుతం గోదావరిలో 10 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు 9,500 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే సీలేరు నుంచి నీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన జల వనరుల శాఖ అధికారులు ఈనెల 10వ తేదీ నుంచి వంతుల వారీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, చాలా ప్రాంతాల్లో నాట్లు పూర్తికాకపోవడంతో వంతుల వారీ విధానాన్ని సాగునీటి సంఘాలు, రైతులు వ్యతిరేకించారు. దీంతో ప్రస్తుతానికి అన్ని ప్రాంతాలకు సాధారణ పద్ధతిలోనే నీటిని పంపిణీ చేస్తున్నారు. ఈనెల 20వ తేదీ నాటికి నాట్లు వేసే ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని.. ఆ తరువాత వంతులవారీ విధానాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నామని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
20 తరువాత నిర్ణయం
ప్రస్తుతం సాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వంతులవారీ విధానాన్ని ఎప్పటినుంచి అమలు చేయాలనే దానిపై ఈనెల 20వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటాం. 20వ తేదీ నాటికి రైతులంతా నాట్లు పూర్తి చేయాలని చెబుతున్నాం.
– పొత్తూరి రామాంజనేయరాజు, చైర్మన్, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ
Advertisement
Advertisement