పిడుగురాళ్ల పట్టణంలో గ్యాంగ్‌లు తయారయ్యాయి. కొందరు యువకులు ప్రాంతానికి రెండు గ్రూపులుగా ఉంటున్నారు
పిడుగురాళ్ల : పిడుగురాళ్ల పట్టణంలో గ్యాంగ్‌లు తయారయ్యాయి. కొందరు యువకులు ప్రాంతానికి రెండు గ్రూపులుగా ఉంటున్నారు. ఈ గ్రూపులో వ్యక్తి మరో గ్రూపునకు దొరికి వెంటనే ప్రత్యేక ప్రదేశాలకు తీసుకెళ్లి చితకబాదేస్తున్నారు. తరచూ ఆడపిల్లల విషయంలో పోటీ పడుతూ పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల ఒకటి, రెండు కేసులు స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీసులు వార్నింగ్‌లు ఇచ్చి పంపారు.
ప్రధాన కూడళ్లలో హడావుడి :
పట్టణంలోని నలంద కళాశాల కూడలి, జిల్లా పరిషత్ హైస్కూల్ , గణపతి కాంప్లెక్స్ వెనుక, గంగమ్మ గుడి సెంటర్ , రైల్వేస్టేషన్ రోడ్డు, జమునా స్కూల్ సమీపంలో, బిలాల్ మసీద్ సెంటర్‌లో ఇలా ఆయా కూడళ్లలో గుంపులు గుంపులుగా ఏర్పడి అమ్మాయిలను ఏడిపించడం, ర్యాగింగ్ చేయడం వంటి విషయాలపై గ్రూపులు గొడవలు పడి కొట్టుకోవడం జరుగుతుంది.
ఫైట్ ప్రదేశాలు ...
రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫామ్ చివర , మార్కెట్ యార్డు గోడౌన్ వెనుక , జమునా స్కూల్ వెనుక , పట్టణానికి చివర హైవేపై ఈ గ్రూపులు ఫైటింగ్‌కు దిగుతుంటారు. ఇటీవల పట్టణానికి చెందిన ఓ ఆర్టీసీ ఉద్యోగి కుమారుడిని కొట్టి గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఎవరైనా గొడవలు ఎందుకని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే వారిపై కూడా దాడులు చేసేం దుకు వెనుకాడటం లేదు. దీంతో ఇది తప్పని చెప్పాలంటే భయపడుతూ ఎవరికి వారు మిన్నకుంటున్నారు.
నిఘా ఏర్పాటు చేస్తాం ...
ఈ విషయాన్ని సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా పట్టణాల్లో పెడదారి పడుతున్న యువతపై పోలీసు నిఘాను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని, వారికి కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు.