నిత్యం ఏదో ఒక వీధిలో గొడవలు పడుతున్న యువకులు
గంజాయి మత్తులో
వీరంగం సృష్టిస్తున్న వైనం
భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
మిర్యాలగూడ అర్బన్: సినిమాల ప్రభావంతో నేటి యువత విలనిజమే హీరోయిజంగా ఫీలవుతున్నారు. దీంతో బయట కూడా సినిమాల్లో లాగా అనుకరిస్తూ పెడదోవ పడుతున్నారు. చిన్నచిన్న గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకుని సెటిల్‌మెంట్లు చేసే స్థాయికి చేరుకుంటున్నారు. బర్త్‌డేలకు కూడా డీజేలు పెట్టి బాణాసంచా కాలుస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడుతూ తమ నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలో నిత్యం ఏదో ఒక వీధిలో గ్యాంగ్‌వార్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దారి తప్పుతున్న యువతను గాడిలో పెట్టేదెవరు..? అని వారి చేష్టలను చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.
మత్తుకు బానిసలుగా మారుతున్నారిలా..
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో పిల్లల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు గుర్తించే అవకాశం ఉండేది. దీంతో ఆ పిల్లాడికి పలు ఉదాహారణలతో మంచి విషయాలపై అవగాహన పెంచేవారు. ఈవిధంగా కుటుంబం నుంచే క్రమశిక్షణ నేర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేవారు. కానీ మారిన పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాలు పెరగడం, భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేస్తుండడంతో పిల్లలను గమనించేవారు లేకుండా పోతున్నారు. దీంతో పిల్లలు ఏం చేస్తున్నారు..? అతడి మానసిక స్థితి ఏవిధంగా ఉంది..? అని పరిశీలించేవారు లేకపోవడంతో ముందుగా స్నేహితులతో సరదాగా సిగరెట్, గుట్కా వంటి వాటికి అలవాటు పడుతూ క్రమంగా గంజాయి తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. మిర్యాలగూడలో గంజాయికి బానిసైన యువకులు సుమారు 2 వేలకు పైగానే ఉంటారని సమాచారం. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసికస్థితిని అర్ధం చేసుకుని వారికి సరైన దిశానిర్ధేశం చేయడం వలన యువత మత్తుకు బానిసలు కాకుండా.. పెడదోవ పట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
మిర్యాలగూడలో ఇటీవల జరిగిన గ్యాంగ్‌వార్‌లు..
👉 మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఉన్న వైన్స్ వద్ద ఇటీవల రాత్రి సమయంలో కొందరు యువకులు కలిసి ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. దీంతో ఆ యువకుడికి తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.
👉రెడ్డి కాలనీకి వెళ్లేదారిలో రాత్రి సమయంలో తల్లీకుమార్తె నడుచుకుంటూ వెళ్తుండగా.. మత్తులో ఉన్న యువకులు వెకిలి చేష్టలు చేయడంతో వారు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిసింది.
👉 పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఓ వీధిలో గత నెల ఫుట్‌బాల్ ఆటలో తలెత్తిన వివాదంలో రెండు గ్యాంగ్‌ల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాలకు చెందిన పది మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
👉 పట్టణంలోని తాళ్లగడ్డ, ప్రకాశ్‌నగర్, గాంధీనగర్, బాపూజీనగర్‌లో ప్రతి రోజు ఏదో గొడవ జరగుతుండగా.. గొడవలు పడిన వారు మత్తులో ఉన్నప్పుడే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు.
పట్టించుకోని పోలీసులు ..
రోజురోజుకు పెరుగుతున్న గ్యాంగ్‌వార్‌లను అరికట్టాల్సిన పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గొడవలకు దిగిన వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగానే పలువురు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని విడిపిస్తుండటంతో సదరు యువకులు మరింత పెట్రేగిపోతున్నారని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ముందుకుపోతే నుయ్యి.. వెనుకకు పోతే గొయ్యి అన్న చందంగా మారిందని, పోలీసులు కూడా మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటున్నారని పోలీస్ శాఖ సిబ్బందే చెబుతుండటం విశేషం.
యువకుడిపై విచక్షణారహితంగా దాడి
మిర్యాలగూడ పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. వివరాలు.. రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో శుక్రవారం పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ చెలరేగి ఓ యువకుడిపై మరికొంతమంది యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి గురైన యువకుడిని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఈ గొడవను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. గాయాలపాలైన యువకుడు శనివారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు
యువత క్రమశిక్షణతో తమ చదువులు, కెరియర్‌పై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారి మానసికస్థితి, వారి ప్రవర్తనను గమనిస్తూ పెడదోవ పట్టినట్లు తెలిస్తే వెంటనే వారికి ఓపికగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడే పిల్లలకు మంచి జీవితం ఇచ్చిన వారమవుతాం. యువత చెడుమార్గం పట్టి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు.
– రాజశేఖరరాజు, మిర్యాలగూడ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment