గంటా చేరికతో విశాఖ టీడీపీలో ముసలం!
- చిచ్చురేపుతున్న గంటా బృందం చేరిక
- కీలక సమావేశాన్ని బహిష్కరించిన అయ్యన్న వర్గం
- వెలగపూడి, పప్పల కూడా దూరం
- బాహాటమైన వర్గ విభేదాలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లా తెలుగుదేశంలో ముసలం మొదలైంది. రెండుగా చీలుతున్నట్లు స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. గంటా బృందాన్ని చేర్చుకోవద్దని స్వరం పెంచిన అయ్యన్న వర్గం శుక్రవారం మరో అడుగు ముందుకేసింది. గంటా పాల్గొన్న కీలక సమావేశాన్ని బహిష్కరించింది. దీంతో అసమ్మతి స్పష్టంగా పాగా వేసినట్టయింది. గంటాతోపాటు ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, ముత్తంశెట్టి,అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల తదితరులను పార్టీనేతలు,కార్యకర్తలకు పరిచయం చేసేందుకు గురువారం సాయంత్రం ఎంవీవీఎస్ మూర్తి నగరంలో ఓ సమావేశం నిర్వహించారు. దీనిని అయ్యన్న వర్గం పూర్తిగా బహిష్కరించింది. ఎలాగూ రారని పార్టీ తరఫున వీరికి ఆహ్వానం కూడా పంపలేదని తెలిసింది.
అయ్యన్న మద్దతుదారులుగా పేరొందిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, మరోనేత పప్పలచలపతిరావు, కోనతాతారావు తదితర సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. మహిళా సదస్సు ఏర్పాట్లపై ఉదయం జరిగిన సమావేశానికి మాత్రం వచ్చారు. అయ్యన్న వర్గం దానికి కూడా హాజరుకాలేదు.
సమావేశంలో గంటాతోపాటు ఎమ్మెల్యేలు తమ ప్రసంగాల్లో పార్టీనేతలతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు గాని అయ్యన్న వర్గం పేర్లను విస్మరించారు. పార్టీలో ఇతర నేతలు కూడా వీరిపేర్లను ప్రస్తావించలేదు. పప్పల చలపతిరావు పేరు మినసా అయ్యన్న వర్గం గురించి ప్రస్తావించలేదు.
గంటారాకతో పార్టీలో ముదిరిపోయిన విబేధాలు పరిచయ కార్యక్రమం ద్వారాబయపడ్డాయి. చంద్రబాబు గురువారం విశాఖనుంచి హైదరాబాద్ బయలుదేరే సమయంలో ఆయన్ను అయ్యన్న కలిశారు. మరోసారి గంటారాకపై తన అభ్యంతరం వ్యక్తంచేశారు.అధినేతకూడా గంటావైపే మొగ్గుచూపడం,తన తనయుడికి అనకాపల్లి పార్లమెంట్ సీటుపై హామీ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్రస్థాయిలో పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు శుక్రవారం సమావేశానికి కూడా అయ్యన్నవర్గం దూరమవడంతో మున్ముందు పార్టీలో వీరి పాత్ర ఎలా ఉంటుందనేదానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా పరిచయ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జులతోపాటు వీవీఎస్‌మూర్తి,బండారు,గవిరెడ్డి,ఆడారితులసీరావు తదితర నేతలు హాజరయ్యారు.