
గంటా తంటా నేను చూసుకుంటా..
*మంత్రి గంటాను టీడీపీలో చేర్చుకోవద్దంటూ అయ్యన్న సూచన
*కలిసి పనిచేయలేమని స్పష్టీకరణ
*పట్టించుకోని చంద్రబాబు
*ఆ విషయం తనకొదిలేయాలని హితవు
*చిన్నబోయిన ‘చింతకాయల’!
సాక్షి, విశాఖపట్నం: ‘రాబోయే ఎన్నికలు పార్టీకి, మనకు చావుబతుకుల్లాంటివి. కొత్త వారు వస్తారు. పార్టీ అవసరాల రీత్యా వారిని మనం స్వాగతించాలి. గంటా శ్రీనివాసరావు విషయం నాకొదిలేయండి. ఆయన్ను ఎక్కడ పెట్టాలో నేను చూసుకుంటా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన మదిలోని మాటను చెప్పకనే చెప్పారు. బుధవారం విశాఖలో మంత్రి గంటా కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు.
రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రతిసారీ పార్టీలు మార్చే మంత్రి గంటాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోవద్దని, అలాంటి వాళ్లను చేర్చుకుంటే పార్టీకే నష్టమని సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఒకవేళ తీసుకుంటే తామెలా పనిచేయాలని చంద్రబాబు ఎదుట మరోసారి తన వ్యతిరేకతను వెల్లగక్కారని సమాచారం. అనకాపల్లి లోక్‌సభ నుంచి తన కుమారుడు విజయ్‌కు పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు అనుకుంటే తాను నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి వెనక్కుతగ్గుతానని తన అభిప్రాయం వెల్లడించినట్టు తెలిసింది.
కానీ బండారు సత్యనారాయణమూర్తి వర్గం గంటా రాకకు పచ్చ జెండా ఊపింది. తన మాటను చంద్రబాబు సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో అయ్యన్న అసహనంతో బయటకు వచ్చేశారని సమాచారం. శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్షించిన బాబు అక్కడ కళా వెంకట్రావు, రామ్మూర్తినాయుడు మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయని, విభేదాలు పక్కనపెట్టి కలిసిపనిచేయాలని, లేదంటే పార్టీకి నష్టమంటూ ఘాటుగా హెచ్చరించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
నా కుమారుడి సీటు కోసం మాట్లాడా..
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్ట్టు పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు చెప్పారు. బాబును కలిసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నా కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు, తనకు నర్సీపట్నంలో ఎమ్మెల్యే సీటు అడిగానన్నారు. ఇంకా ఆయన ఎటువంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. ఒకే కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదంటే తాను పక్కకు తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. టీడీపీ నేతలు సి.ఎం.రమేష్, పయ్యావుల కేశవ్‌లు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయన్నారు.