గుది‘బండ’ | Gas customers problems are not clearing | Sakshi
Sakshi News home page

గుది‘బండ’

Published Fri, Dec 27 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

Gas customers problems are not clearing

సాక్షి, కడప : గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 412 అయితే లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి రూ. 450 వసూలు చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్, బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం చేసుకున్న కొంతమందికి సబ్సిడీమొత్తం జమగాక ఇబ్బందుల పాలవుతున్నారు.
 
 ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే కొన్ని గ్యాస్ ఏజెన్సీల్లో 15 నుంచి 20 రోజులకుగానీ సిలిండర్‌ను సరఫరా చేయడంలేదు. మామూలుగా బుక్ చేసుకున్న వారికంటే తమకు సిలండర్‌కు రూ. 50 వ్యత్యాసం వస్తున్నట్లు ఆధార్ నమోదుచేసుకున్న వారు గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్ బిల్లు మేరకే డబ్బు చెల్లించాలిగదా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తే బాయ్స్ మాత్రం మళ్లీ గ్యాస్ సరఫరా చేసేటప్పుడు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
 
 దీంతో వారు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నదని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు స్టవ్ తప్పనిసరిగా తీసుకోవాలని కొన్ని ఏజెన్సీలు నిబంధన పెడుతున్నాయి. కొత్త కనెక్షన్ సింగిల్ సిలిండర్ ధర రూ. 2200 ఉండగా, కొన్ని ఏజెన్సీలు రూ. 3000-3500 వసూలు చేస్తున్నాయి. మరికొన్నిచోట్ల దళారులను ఏర్పాటుచేసుకుని ఏకంగా రూ.5 వేలకు పైబడి వసూలు చేయడం గమనార్హం.
 
 గ్యాస్ తిప్పలు ఇలా....
  ప్రొద్దుటూరులో గ్యాస్ సిలిండర్ బిల్లు కంటే అదనంగా రూ. 30-40 వసూలు చేస్తున్నారు. కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దళారులను  ఏర్పాటు చేసుకుని సింగిల్ సిలిండర్ కనెక్షన్ కోసమే రూ. 5 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
 
  జమ్మలమడుగులో గ్యాస్ బుక్ చేసుకుని రూ. 1150 చెల్లించి సిలిండర్ తీసుకున్నప్పటికీ సబ్సిడీ మొత్తం జమ కాలేదని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం ఎవరికి చెబితే సమస్య పరిష్కారం అవుతుందో తెలియక తికమక పడుతున్నారు.
 
  బద్వేలులో కొత్త కనెక్షన్‌కు మామూలు ధర కంటే అదనంగా రూ. 700-800 వసూలు చేస్తున్నట్లు సమాచారం. పోరుమామిళ్లలోని బాష ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో దీపం కనెక్షన్‌దారులు 41 రోజులకు, మామూలు సిలిండర్‌దారులు 28 రోజులకు బుక్ చేసుకోవాలనే నిబంధన పెడుతున్నారు. బుక్ చేసుకున్న 10-15 రోజులకుగానీ గ్యాస్ ఇవ్వకపోవడంతో వినియోగదారులు అల్లాడుతున్నారు. బిల్లు కంటే అదనంగా రూ. 50 చెల్లించాల్సివస్తున్నదని వాపోతున్నారు. కొత్త కనెక్షన్‌కు సైతం రూ. 3500 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టవ్‌తో కలిపితే రూ. 5500 రాబడుతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు.
 
  మైదుకూరులో ఆరు వేల కనెక్షన్లు ఉన్నప్పటికీ గ్యాస్ ఏజెన్సీ లేకపోవడంతో చాపాడు, ప్రొద్దుటూరు నుంచి ఆటోల ద్వారా సిలిండర్ రవాణా జరుగుతోంది. సబ్సిడీ మొత్తం అకౌంట్లలో జమ కావడం లేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
 
  రాయచోటిలో ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేసుకున్న వారికి, మామూలుగా బుక్ చేసుకున్న వారికి ఓ సిలిండర్‌పైనే రూ. 50 వ్యత్యాసం ఉంటుందని వాపోతున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ సకాలంలో అందడం లేదనే విమర్శలు ఉన్నాయి.
 
  కమలాపురంలో ఆన్‌లైన్‌లో గ్యాస్ నమోదు చేసుకున్నా సిలిండర్ ఇచ్చేదుకు 20 రోజుల సమయం పడుతున్నట్లు వాపోతున్నారు. నగదు బదిలీ సరిగా అకౌంట్లలో జమకావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.
 
  రాజంపేటలో ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికి సకాలంలో సబ్సిడీ మొత్తం జమ కావడంలేదనే విమర్శలు ఉన్నాయి.
 
  పులివెందుల నియోజకవర్గం తొండూరులో  ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. లింగాలలోని గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలనే పేరుతో సిలిండర్‌కు రూ. 490  వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో డెలివరీ ఛార్జీల పేరుతో అదనంగా రూ. 30 వసూలు చేస్తున్నారు.
 
 ఆధార్ కష్టాలు
 గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో లింకు పెట్టవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఆధార్ నమోదు చేసుకోవాల్సిందేనని గ్యాస్ ఏజెన్సీలు, అధికారులు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఆధార్ నమోదు చేసుకున్నా కొంతమందికి సబ్సిడీ మొత్తం జమగాక ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి మొత్తం రూ. 1112 చెల్లించలేక అల్లాడుతున్నారు. సబ్సిడీ మొత్తం రూ. 641 జమ అవుతుండడంతో మామూలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారి కంటే అదనంగా రూ. 50 చెల్లించినట్లు అవుతోందని వాపోతున్నారు.
 
 జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే ఆధార్ నమోదు ఇండేన్ గ్యాస్ 1,73,872, హెచ్‌పీ 1,08,752, భారత్ 50,291 కలిపి మొత్తం 3,32,917 మంది అంటే 63 శాతం నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇండేన్‌లో  1,10,055, హెచ్‌పీలో 73,850, భారత్‌లో  28,460 కలిపి మొత్తం 2,10,095 అంటే 43 శాతం మందికి మాత్రమే బ్యాంకు అనుసంధానమైనట్లు తెలుస్తోంది. డిసెంబరు చివరి నాటికి తప్పక చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు హెచ్చరిస్తుండటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement