ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : చమురు కంపెనీలు గ్యాస్ సిలిండ ర్ ధరను పెంచాయి. వినియోగదారులపై కొరడా ఝుళిపించాయి. ఇటీవల డీజిల్ ధరను పెంచిన విషయం మరువక ముందే సిలిండర్ ధరను పెంచి భారం మోపాయి. ఆదిలాబాద్‌లో రూ.1,041 నుంచి రూ.1,107 కు పెంచారు. సబ్సిడీ సిలెండర్లతోపాటు వాణిజ్య సిలిండర్ల ధర కూడా పెంచారు. పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుంచి అమలలోకి వచ్చాయి. వినియోగదారుడు సిలిండర్ తీసుకునేటప్పుడు అదనంగా రూ.66 చెల్లించాలి.
కాగా వినియోగదారుడు సిలిండర్ తీసుకున్న తర్వాత బ్యాంకులో జమయ్యే సబ్సిడీ రూ.575 నుంచి రూ.633కు పెరిగింది. సబ్సిడీ రూ.58 పెరిగింది. తద్వారా పెంచిన సబ్సిడీ సిలిండర్ ధర కారణంగా వినియోగదారునిపై సుమారు రూ.8 భారం పడనుంది. నెలకు సుమారు రూ.22 లక్షలు, ఏడాదికి రూ. 2.50 కోట్లు అదనంగా వినియోగదారులు చెల్లించాలి. సబ్సిడీ సిలిండర్‌లు ఏడాదికి తొమ్మిదే పరిమితి ఉండడంతో ఆ తర్వాత తీసుకునే సిలిండర్ పరంగా వినియోగదారునికి కష్టాలు తప్పవు. పెరిగిన మొత్తం ధర భరించాల్సి వస్తుంది. ఆ విధంగా చూస్తే ప్రజలకు ఇది భారమే. కాగా వాణిజ్య సిలిండర్(19 కేజీ) ధరను రూ.1,773 నుంచి రూ.1,883కు పెంచారు. రూ.110 పెరగడంతో వాణిజ్య సిలిండర్ వినియోగదారులపై భారం పెరిగింది.
75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి
జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 9 ఏజెన్సీలు, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీ) 12 ఏజెన్సీలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీ) 11 ఏజెన్సీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఆధార్ సీడింగ్ కాని సబ్సిడీ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీ మినహాయించి నేరుగా వచ్చే ధరకే సిలిండర్ ఇస్తున్నారు. ఈ వినియోగదారులకు ఇదివరకు రూ.415 పై సబ్సిడీ సిలిండర్ ఇస్తుండగా ప్రస్తుతం రూ.419కి పెంచారు. ఇది ఆధార్ నమోదు చేసుకున్న వారికి, నమోదు చేసుకోని వారికి ధరల పరంగా వ్యత్యాసం ఉండడంతో వినియోగదారుల్లో గందరగోళం వ్యక్తమవుతోంది.
కట్టెల పొయ్యే దిక్కు..
నా పేరు లక్ష్మి, మాది ఆదిలాబాద్ పట్టణంలోని పీహెచ్ కాలనీ. సర్కారు గ్యాస్ ధర పెంచిందని వినడంతో గుండె దడేల్ మంది. ఇప్పటికే కరెంటు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సతమతం అవుతున్నాము. ఇప్పుడు ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి మరోమారు భారం వేసింది. వంటింట్లోకి వెళ్లాలంటేనే భయమవుతుంది. గ్యాస్ వాడకం కష్టమే. ఇక కట్టెల పొయ్యే మేలు.
గ్యాస్ ధర పెంపు
Published Wed, Dec 4 2013 6:00 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement