సాక్షి, హైదరాబాద్: ‘కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఈ ఏడాది మార్చిలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడే మీరూ మద్దతిచ్చి ఉంటే పరిస్థితి రాష్ట్ర విభజన వరకు వచ్చేది కాదు కదా.. ఎంతపని చేశారు బాబూ’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అప్పుడు నిస్సిగ్గుగా విప్ జారీ చేసి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడారని గట్టు గుర్తుచేశారు. అసెంబ్లీలో 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత సంఖ్యాబలం లేదని అప్పుడు చెప్పిన బాబు.. ఇప్పుడు కేంద్రంలో కనీస సంఖ్యా బలం లేకపోయినా అవిశ్వాసం పెడతామని చెప్పడంలోని మతలబేంటో చెప్పాలన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ వైఖరేంటో చెప్పకుండా నలుగురు కోస్తా, రాయలసీమ ఎంపీలతో అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇప్పించడం, తెలంగాణ ఎంపీలతో తెలంగాణ కావాల్సిందేనని చెప్పించడంలోని ఆంతర్యమేంటని సోమవారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ‘నాలుగు రాష్ట్రాల ఎన్నిక ల్లో అవినీతిపరులను ఓడించారని బాబు చెబుతున్నారు. మన రాష్ట్రంలో 2001 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీని ఓడిస్తూ వస్తున్నారు. అంటే బాబు తాను అవినీతిపరుడినని అంగీకరించినట్లే’ అని గట్టు వ్యాఖ్యానించారు.