బాబు వ్యాఖ్యల మర్మమేంటి?: గట్టు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనపై సుమారు 11 ఏళ్ల క్రితం అలిపిరిలో జరిగిన దాడి కేసును దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పక్కదారి పట్టించారని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో కానీ, ఆయన మరణించిన తర్వాత ఇద్దరు సీఎంలు మారినప్పుడు కాని చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు.. 11 ఏళ్ల తర్వాత అలిపిరి కేసును వైఎస్ పక్కదారి పట్టించారని చెప్పడం వెనక ఏదో కుట్ర దాగున్నట్లు తెలుస్తోందని గట్టు అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.
‘‘2003లో సీఎంగా ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లా అలిపిరి వద్ద నక్సల్స్ దాడిలో గాయపడినప్పుడు స్వంత కేబినెట్ సభ్యులు కూడా పరామర్శకు వెళ్లలేదు. వారంతా వేరే దగ్గర సమావేశమై ఎవరు సీఎం కావాలంటూ చర్చించుకుంటున్న దశలో... రాజశేఖరరెడ్డి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అంతేకాదు దాడి జరిగిన ప్రదేశంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. దేవుడే చంద్రబాబును రక్షించారని చెప్పి ఆయన కంటనీరు పెట్టుకున్న విషయం గుర్తులేదా’’ అని గట్టు ప్రశ్నించారు. అలాంటి వైఎస్ మీద అభాండాలు వేయడం చంద్రబాబు నైజాన్ని తెలియజేస్తోందన్నారు. ‘వైఎస్ సీఎం అయ్యాక గంగిరెడ్డి విషయంలో కాని, కాల్పుల ఘటనలో బాలకృష్ణ విషయంలో గానీ ఎక్కడా ఉపేక్షించారని మేము నమ్మడంలేదు. రాజశేఖరరెడ్డి చట్టాన్ని ఎప్పుడూ గౌరవించేవారు. చట్టం ముందు అందరూ సమానమేనని నమ్మిన వ్యక్తి వైఎస్. ఎవరి మీద పగతీర్చుకోవాలనో, అధికారాన్ని ఉపయోగించో, కుట్రలు పన్నో ఎదుటి వారిని ఎదుర్కోవాలనే లక్షణం వైఎస్‌ది కాదు’ అని అన్నారు. దరిద్రపు అవలక్షణాలన్నీ చంద్రబాబుకు ఉండబట్టే 11 ఏళ్ల తర్వాత అలిపిరి ఘటనను చర్చకు తీసుకొస్తున్నారని, రాబోయే కాలంలో జరగబోయే కుట్రకు చంద్రబాబు సంకేతమిచ్చినట్లుగా అర్థమవుతోందని గట్టు అన్నారు.