
బాబూ.. 11 ఏళ్ల తర్వాత అలిపిరి ఘటన గుర్తుకొచ్చిందా?
హైదరాబాద్: పదకొండేళ్ల క్రితం జరిగిన అలిపిరి ఘటనలో ముద్దాయి గంగిరెడ్డి గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడటం వెనుక అసలు కుట్ర ఏంటని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. అలిపిరిలో దాడి జరిగిన తర్వాత ఏడెనిమిది నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ సమయంలో ఆయన ఏం చేశారని నిలదీశారు.
ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ, వైఎస్ మరణాంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న సమయంలో కానీ చంద్రబాబు ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అలిపిరి ఘటన తర్వాత అందరికంటే ముందు చంద్రబాబును పరామర్శించింది వైఎస్‌ఆరేనని గుర్తు చేశారు. చట్టం ముందు అందరూ సమానమని వైఎస్ భావించారని, వైఎస్‌పై అభాండాలు వేయడం చంద్రబాబుకు తగదని గట్టు రామచంద్రరావు హితవు పలికారు.