మురుగ కాలువలో నుంచి శిశువును తీస్తున్న మున్సిపల్ వర్కర్ లక్ష్మీదేవి
అమ్మా..నేనంటే నీకెంతో ఇష్టమని తెలుసు..నన్ను తొమ్మిది నెలలు అపురూపంగా చూసుకున్నావు..నా ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడావు..నేను కసిగా కడుపులో తంతున్నా సంతోషించావు..అమ్మా..నీకే కష్టమొచ్చిందో తెలియదు..నా ఒంటిపై నీ రక్తపు మరకలు ఆరకముందేబంధాన్ని తెంపేసుకున్నావు..పుట్టిన వెంటనే నీ వెచ్చని పొత్తిళ్లలో సేదదీరాల్సిననేను మురుగు కాల్వ పాలయ్యాను..అమ్మా..నీ ప్రేమే నన్ను కాపాడింది..నేను క్షేమంగా ఉన్నాను..కర్నూలు పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్నాను..అమ్మా..నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది!!..ఆదోని పట్టణం కంచిగారి వీధిలో గురువారంమురుగు కాలువలో దొరికిన పసిపాప మూగ వేదన ఇదీ..
కర్నూలు, ఆదోని: ఆడ బిడ్డనో..మరేదో కారణమో..అప్పుడే పుట్టిన పసిబిడ్డను మురుగు కాలువలో పడేశారు. కాలువలో నీరు లేక పోవడంతో చెత్తలో గుక్క పట్టి ఏడుస్తున్న పసిగుడ్డును గుర్తించిన మున్సిపల్ వర్కర్లు కొందరు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. దీంతో ఆ శిశువు ప్రాణాలతో బయట పడింది. గురువారం ఆదోని పట్టణం నడిబొడ్డున కంచిగారి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 5.30 గంటల సమయంలో మున్సిపల్ వర్కర్లు లక్ష్మిదేవి, ఈరమ్మ, తిరుమల, రంజనీకాంత్, మారెప్ప, ఈరప్ప మరికొందరు మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు కంచిగారి వీధిగుండా వెళ్లుతున్నారు. ఎక్కడి నుంచో చిన్నగా పసిగుడ్డు ఏడ్పు విని పించడంతో మురుగు కాలువలో తొంగి చూశారు. చెత్తపై పరిచిన ఓ ప్లాస్టిక్ సంచిపై రక్తం తడారని ఓ పసిగుడ్డు కనిపించింది. బలహీనంగా ఉండడంతో ఏడ్పు చిన్నిగా వస్తోంది. ఇంకా బొడ్డు కూడ కోయలేదు. లక్ష్మీదేవి వెంటనే ఆ పసిగుడ్డును ఎత్తుకుంది. మిగిలిన వారితో చర్చించి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు వెంకటస్వామి, ఉషాశ్రీ పసిగుడ్డును ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. బిడ్డ బలహీనంగాను, తక్కువ బరువు ఉందని, కోలుకోడానికి కొంత సమయం పుడతోందని వైద్యురాలు ఉషశ్రీ అన్నారు.
స్వాధీనం చేసుకున్న ఐసీడీఎస్ అధికారులు
సమాచారాన్ని త్రీ టౌన్ ఎస్‌ఐ రాజా కుళ్లాయప్ప, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సఫరున్నీషాబేగంకు అందించారు. ఇరువురు ఆసుపత్రికి వచ్చి శిశువును పరిశీలించి.. ఆరగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఐసీడీఎస్ అధికారిణి సఫరున్నిసా బేగం..శిశువును స్వాధీనం చేసుకొని కర్నూలు పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెతో పాటు సూపర్‌వైజర్ అంజినమ్మ, అంగన్ వాడీ టీచర్లు ఉన్నారు. పసిగుడ్డును మురుగు కాలువపాలు చేసిందెవరో విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాజాకుళ్లాయప్ప తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment