బాలికను మింగినది
గజపతినగరం రూరల్: వారంతా ఆటపాటలు, సరదా సంతోషాలు తప్ప, కల్లాకపటం తెలియని, ప్రమాద విషయాలు పట్టని చిన్నారులు. కార్తీకమాసం కదా అని అంతా కలిసి పిక్నిక్‌కి వెళ్లారు. మధ్యాహ్నం వరకు ఆటపాటలతో కేరింతలు కొట్టారు. భోజనాలు చేసి సరదాగా స్నానానికి వెళ్లారు. చిన్నారులు కదా నాతో జలకాలాడడానికి వచ్చారన్న జాలి లేకుండా చం పావతి నది నలుగురు చిన్నారులకు తన గర్భంలోకి లాగేసింది. అష్టకష్టాలు పడి ఓ ముగ్గురు చిన్నారులు బయట పడగలిగినప్పటికీ ఓ బాలిక మాత్రం విగతజీవిగా మారింది. విహారంలో విషాదం సంభవించిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త బగ్గాం గ్రామానికి చెందిన 15మంది పిల్లలు ఆదివారం ఇదే మండలంల్నో కొణిశ గ్రామానికి పిక్‌నిక్‌కు వెళ్లారు.
చిన్నారులంతా ఆటపాటలతో గడిపి భోజనాలు చేసిన అనంతరం సమీపంలో ఉన్న చంపావతి నదిలో స్నానాల కోసం దిగారు. పిల్లల్లో కొంతమంది ఒడ్డున,మరికొంతమంది నది మధ్యలోకి వెళ్లి స్నానాలు చేయసాగారు. అందరూ 15సంవత్సరాల లోపు వయస్సు వారే.అయితే దురదృష్ట వశాత్తు సిరిపురపు రేణుక అనే బాలిక నదిలో స్నానం చేస్తుండగా పెద్దగోతిలో పడిపోయి రక్షించండి బాబోయ్ అని కేకలు వేస్తూ మునిగి పోతున్న సమయంలో ఒడ్డున కూర్చున్న అర్జి నాగలక్ష్మి రేణుకను రక్షించబోయి ఆమెతో పాటు నీటిలో మునుగుతూ తేలుతూ ఉంది.ఇంతలో రేణుక తమ్ముడు రఘు, నాగలక్ష్మి తమ్ముడు నరేంద్ర అక్కలిద్దరినీ రక్షించబోయి వారు కూడా నదిలో మునిగి పోతూ పెద్ద కేకలు వేయగా అదే గ్రామానికి చెందిన కన్నూరి శ్రీను అనే వ్యక్తి పరుగుపరుగున వచ్చి ఆముగ్గురినీ ఒక్కొక్కరినీ బయటకు నెట్టివేసి వారి ప్రాణాలను కాపాడాడు. శ్రీను ఆసమయంలో లేక పోతే రేణుకతో పాటు ఆముగ్గురు విగత జీవులై ఉండేవారని గ్రామస్తులు తెలిపారు.
రేణుక ఆచూకీ కోసం మూడు గంటల పాటు వెతుకులాట
నదిలో మునిగిపోయిన రేణుక కోసం స్థానికులతో పాటు ఎస్సై డి.సాయికృష్ణ బృందం,అగ్నిమాపక సిబ్బంది,స్థానిక తహశీల్దార్ ప్రసాద్ పాత్రో ఇతర అధికారులు శాయశక్తులా మూడుగంటల పాటు వెతికారు. అయితే చివరికి రేణు కకు వరుసకు అన్నయ్య అయిన సిరిపురపు సూర్యనారాయణ, పోలీసు బృందానికి ఆమె మృతదేహం దొరకింది. దీంతో రేణుక బంధువులు, గ్రామ ప్రజల కన్నీటితో గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రేణుక తల్లి దండ్రులు రమణ,సత్యవతి కూలి పనికోసం తిరుపతి వలస వెళ్లారు. ఆ దంపతులకు రేణుక,రఘు అనే ఇద్దరు పిల్లలు ఉండడంతో వారిద్దరు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. రేణుక మృతిచెందిన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు రోదిస్తూ తిరుపతి నుంచి బయల్దేరారు. గ్రామ సర్పంచ్ సంజీవరావు సహాయంతో పోలీసుల సమక్షంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో శవపంచనామా నిర్వహించారు.
వేగావతిలో విద్యార్థి గల్లంతు
విశ్వనాథపురం(పాచిపెంట): సాలూరులోని సత్యసాయి జూనియర్ కళాశాల విద్యార్థి దాసరి వంశీ (17) పాచిపెంట మండలం విశ్వనాథపురంలోని వేగావతి నదిలో ఆదివారం గల్లంగయ్యాడు. సహ విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలకు చెందిన విద్యార్థులు పిక్నిక్ కోసం వేగావతి నది వద్దకు వచ్చారు.సరదాగా నదిలో దిగిన విద్యార్థి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఎస్సై రవికుమార్‌తో పాటు ఉప తహశీల్దార్ గిరిధర్,సాలూరు అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం వరకూ గాలింపు చేపట్టినా మృతదేహం లభించలేదు. వంశీ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకును తల్లి పాచిపనులు చేసుకుంటూ చదివిస్తోంది. కుమారుడు గల్లంతయ్యాడన్న విషయం తె లుసుకున్న తల్లి భోరున విలపించడంతో ఎవరికీ ఆపతరం కాలేదు. వంశీ సాలూరు అగురువీధికి చెందినవాడు.