వ్యవ‘సాయి’...నిత్యం శ్రమసాయి. ఖరీఫ్, రబీ సీజన్ల దోబూచులాట..ఇది ప్రకృతి పరంగా తలెత్తే సమస్య. ఇక పాలకుల అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం కలిసి ఇప్పుడు విద్యుత్తురూపంలో అన్నదాతలను వేధిస్తున్నాయి. పంటలు చేతికంది కష్టం దక్కించుకునే దశలో ‘పవర్‌కట్’ రైతుల ఆశలను చిదిమేస్తున్నాయి. పచ్చని చేళ్ల జీవాలను తీసేస్తున్నాయి. అందుకే శనివారం భగ్గుమన్నారు. ఆరుగ్రామాల వారు ఏకమై జాతీయ రహదారి ఎక్కారు. ట్రాన్స్‌కో సిబ్బందిని బంధించారు. విద్యుత్తు అందివ్వని దుస్థితిపై మండిపడ్డారు. ఇలా అయితే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
అలంపూర్, న్యూస్‌లైన్ : పంట సాగులో అన్నదాతలకు ఊరట లేకుండాపోతోంది. ఇంత వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు వెంటాడితే ఇప్పుడు కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. గత నెల రోజులుగా ఎడాపెడా విధిస్తున్న కరెంట్ కోతలతో బోరు మోటార్లపై ఆధారపడి పంట సాగు చేసిన రైతులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. రైతులకు త్రీఫేస్ కరెంట్ ఉదయం నాలుగు గంటలు, రాత్రి మూడు గంటల వంతున ఏడు గంటల పాటు సరఫరా చేయాల్సి ఉంది. కానీ గత నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. ఆరు గంటల విద్యుత్ కూడా అందడం లేదు. ఈ విషయాన్ని విద్యుత్ ఏడీ, ఏఈలకు సమాచారం అందించినా వారి నుంచి స్పందన కరువైంది.
అలంపూర్ మండలంలోని మారమునగాల, సింగవరం, కాశీపురం, అలంపూర్, కంచుపాడు గ్రామాల రైతులు బోరు బావులను నమ్ముకొని సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ తదితర పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ పంటలకు నీటిని అందిస్తేనే పంట జీవం పోసుకుంటుంది. లేదంటే రైతులు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అయినా అధికారులు ఈ విషయమై పట్టించుకోకపోవడంతో వారు ఆందోళన బాటపడుతున్నారు.
సాగు పరిస్థితి ఇదీ..
ప్రభుత్వం రైతులకు ఏడు గంటల కరెంట్ అందిస్తామని హామీ ఇవ్వడంతో ఉన్న బోరు బావులు, మోటార్లపై ఆధారపడి రబీలో పంట సాగు చేశారు. అలంపూర్ మండలంలో మొక్కజొన్న 164 హెక్టార్లలో, పప్పుశనగ 5674 హెక్టార్లలో, వేరుశనగ 38 హెక్టార్లలో, పొగాకు-248 హెక్టార్లలో సాగు చేశారు. వడ్డేపల్లి మండలంలో వరి 248 హెక్టార్లలో, జొన్న 774 హెక్టార్లలో, మొక్కజొన్న 1365 హెక్టార్లలో, పప్పుశనగ 3046 హెక్టార్లలో, వేరుశనగ 205 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 34 హెక్టార్లలో సాగైంది. మానవపాడులో వరి 32హెక్టార్లలో, పప్పుశనగ 6655 హెక్టార్లలో, వేరుశనగ 285హెక్టార్లలో, పొగాలకు 117 హెక్టార్లలో వేశారు. ఇటిక్యాల మండలంలో వరి 551 హెక్టార్లలో, పప్పుశనగ 3457 హెక్టార్లలో, వేరుశనగ 640 హెక్టార్లలో సాగు చేయడం జరిగింది. వీటితోపాటు ఖరీఫ్‌లో సాగు చేసిన మిరప, పత్తి పంటలకు నీటి అవశ్యకత ఉంది. కానీ కోతల కారణంగా సకాలంలో నీరందడం లేదు.
ఆందోళన బాటలో అన్నదాత
మండల పరిధిలోని గ్రామాల రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి అలంపూర్ సబ్ స్టేషన్ శనివారం చేరుకున్నారు.అక్కడ అధికారులు లేకపోవడంతో ఉన్న ఆపరేటర్‌ను నిర్భంధించారు. అనంతరం అలంపూర్ చౌరస్తాలోని ఏడీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కానీ అక్కడకు వెళ్లిన రైతులకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు జాతీయరహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అనంతరం విద్యుత్ అధికారులు స్పందించడం లేదని వారిపై కేసునమోదు చేయాలని లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
10 ఎకరాల్లో మిరప సాగు చేశాను...
ఏడు గంటల కరెంట్ ఇస్తామని చెప్పడంతో బోరు మోటార్లపై ఆధారపడి 10 ఎకరాల్లో మిరప సాగు చేశాను. ప్రస్తుతం పంటకు నీటి అవసరం ఎంతో ఉంది. కానీ కరెంట్ దోబూచులాడుతుండటంతో పంటకు నీళ్లందించలేకపోతున్నాను. ఇలా అయితే వేసిన పంటలు ఎండిపోయి నష్టపోవాల్సి వస్తుంది.
-పుల్లారెడ్డి, రైతు, కాశీపురం
నీళ్లందకపోతే కష్టం
బోరు మోటార్లు ఉన్నాయి కదా అని మిరప, పత్తి సాగు చేశాను. కానీ కరెంట్ కోత కారణంగా పంటలకు నీళ్లందించలేకపోతున్నాను. అర గంట వచ్చి ఆ తర్వాత బంద్ అవుతోంది. దీంతో మొత్తం పంటకు నీళ్లు అందించడం సాధ్యపడటం లేదు.
-నర్శింహ్ములు, రైతు, మారమునగాల
దిక్కుతోచడం లేదు...
కరెంట్ కష్టాలు పంటలను ఎలా కాపాడుకోవాలో దిక్కు తోచడం లేదు. కరెంట్ కోతలు ఉండవని 20 ఎకరాల్లో మొక్కజొన్న వేశాను. తీరా పంటకు అవసరం ఉన్న సమయంలో నీళ్లందించడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తేనే పంటలను కాపాడుకోగలం.
-విశ్వనాథం, రైతు, అలంపూర్
ఇదేం కష్టం... ఎన్నాళ్లీ నష్టం
Published Sun, Jan 12 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement