దేవుడా...! | God ...! | Sakshi
Sakshi News home page

దేవుడా...!

Published Mon, Dec 15 2014 3:24 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

God ...!

రాయచోటి: చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై సంబేపల్లె మండ లం నారాయణరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని కుటుంబం మొత్తం మృత్యువాత పడింది.  వివరాల్లోకి  వెళితే..చిత్తూరు -1 డిపోకు చెందిన ఆర్టీసి అద్దె బస్సు ప్రొద్దుటూరుకు వెళ్తోంది. రాయచోటి నుంచి సంబేపల్లెకు  మోటార్‌సైకిల్ పై  ఉపాధ్యాయుడు బుక్కె సూర్యనాయక్ (34),అతని భార్య సుమతి (28), కుమారుడు సుశాంత్ (8),కుమార్తె సార్ధిక (5) వెళ్తుండగా అతి వేగంగా వస్తున్న  బస్సు  మోటారు సైకిల్‌ను ఢీ కొంది. సుమారు 20 మీటర్లకు పైగా మోటార్‌సైకిల్‌ను ఈడ్చుకెళ్లడంతో   కుటుంబ సభ్యులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం సెలవుదినం కావడంతో  సూర్యనాయక్ కుటుంబసభ్యులతో కలిసి   సినిమా చూడటానికి రాయచోటి వెళ్లారు.  సినిమా అనంతరం మార్కెట్‌లో కూరగాయలు,సరుకులు కొనుగోలు   చేసి  సంబేపల్లెకు  బయలుదేరారు.
 
  వారు నారాయణరెడ్డిపల్లె వద్దకు  చేరుకోగానే బస్సు ఢీకొంది.   మోటార్‌సైకిల్‌ను  సూర్యనాయక్ నడుపుతుండగా  ముందు వైపు చిన్నారి సార్ధిక కూర్చోగా,  వెనుక వైపు అతని  భార్య,కుమారుడు ఉన్నట్లు ప్రమాద ఘటనను బట్టి తెలుస్తోంది.  సంఘటన ప్రాంతం రక్తపు మడుగులా మారింది.   సూర్యనాయక్ తెచ్చుకున్న  కూరగాయలు,సరుకులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సంబేపల్లె ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బంధువులు,స్నేహితులు సంఘటన స్థలానికి తరలివచ్చారు. అనంతరం  మృతదేహాలను  రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఈ మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
 మరో పది నిమిషాల్లో  ఇంటికి చేరుకునేవారుః
 ఆదివారం సెలవు దినం కావడంతో  కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడటానికి  సూర్యనాయక్ రాయచోటికి వెళ్ళాడు.  సినిమా చూసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు సంబేపల్లెకు బయల్దేరారు.  మరో ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి వెళ్లే వారు.  ఆర్టీసీ అద్దె బస్సు రూపంలో మృత్యువు వారిని వెంటాడింది.  సూర్యనాయక్ స్వగ్రామం  సంబే పల్లె మండలం పెద్దబిడికి  కాగా అదే మండలంలోని పాళెంగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అతని భార్య సుమతి దుద్యాల ఏఎన్‌ఎంగా పని చేస్తోంది.  కుమారుడు సుశాంత్  రాయచోటిలోని ఓ పాఠశాలలో 2వ తరగతి చదువుకుంటుండగా, కుమార్తె సార్ధిక సంబేపల్లెలోనే చదువుకుంటోంది. సంబేపల్లెలోని ఎంఆర్‌సీ సమీపంలోనే వీరు నివాసం ఉంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోడంతో వారి తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు,స్నేహితులు ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement