
పుష్కర తొక్కిసలాట సందర్భంగా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు (ఫైల్)
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 29 మంది 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. 52 మంది గాయాలపాలయ్యారు. మహా పుష్కరాల పేరుతో తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటం కారణంగా జరిగిన ఈ దుర్ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ దుర్ఘటన జరిగి నేటికి మూడేళ్లయినా.. ఈ ‘మహా’పాపానికి గల కారణాలు, దోషులెవ్వరనేది ఇంకా తేలలేదు. ఈ నిజాలను నిగ్గు తేల్చేందుకు వేసిన ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పటి వరకూ చంద్రబాబు సర్కారు బహిర్గతం చేయలేదు.
రాజమహేంద్రవరం క్రైం: ‘మహా’ ఘోరం జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యింది. 2015 జూలై 14న గోదావరి మహా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారయావ కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 52 మంది గాయాలపాలయ్యారు. మహా పుష్కరాల పేరుతో నెలల తరబడి ప్రచారం నిర్వహించింది చంద్రబాబు సర్కారు. మరోవైపు ఆ ప్రచారాన్ని తన లబ్ధి కోసం వినియోగించుకునేందుకు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌కు పుష్కర క్రతువును చిత్రీకరించే బాధ్యత అప్పగించారు. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్‌లో తన కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానం ఆచరించి సుమారు రెండు గంటలకు పైగా ఘాట్‌లోనే ఉండిపోవడంతో పుష్కర ఘాట్ జన సంద్రమైంది.
ప్రజలు పుష్కర స్నానం ఆచరించడానికి తీవ్ర జాప్యం జరగడం, పుష్కర ఘాట్ సమీపంలో గోదావరి రైల్వేస్టేషన్, గోకవరం బస్టాండ్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఘాట్‌కు చేరుకోవడం, ఒకేసారి ఏడు రైళ్లు గోదావరి రైల్వే స్టేషన్‌కు చేరడం తదితర కారణాల వల్ల ఘాట్ పూర్తిగా లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది. వీఐపీ ఘాట్(సరస్వతీ ఘాట్) ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులు, రాష్ట్ర అధికారులు మొత్తం 20కి పైగా వాహనాల కాన్వాయి ఘాట్‌లో గంటల తరబడి ఉండిపోవడంతో ప్రజలు విపరీతంగా పెరిగిపోయారు. తెల్లవారు జాము నుంచి ఘాట్‌లోకి వదలకుండా ముఖ్యమంత్రి తన పుష్కర స్నానం ముగించుకొని వెళ్లగానే భక్తులను ఘాట్‌లోకి అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి మొత్తం 29 మంది అక్కడికక్కడే మృతి చెందగా 52 మంది గాయాలపాలయ్యారు.
నిజాయితీ నిరూపించుకునేందుకు కమిషన్
సంఘటన జరిగిన ఏడాది తరువాత ప్రభుత్వం తన తప్పులేదని, ప్రజల తప్పే అని నిరూపించుకునేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సోమయాజులుతో ఏకసభ్య కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్ రాజమహేంద్రవరం ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో అనేక సార్లు బహిరంగ విచారణ జరిపినా ప్రభుత్వ శాఖలు సమాచార శాఖ, పర్యాటక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ, తదితర శాఖలు తమ వద్ద ఉన్న ఆధారాలు, వీడియో క్లిప్పింగ్‌లు, నివేదికలు సమర్పించడంలో కమిషన్‌కు సహకరించలేదు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య నమోదు చేయడంలో ఒక శాఖకు, మరో శాఖకు పొంతన లేకుండా ఉంది.
ఆ వీడియోలు బయటపెట్టని ప్రభుత్వం
పుష్కర క్రతువు జరుగుతున్న తీరును ప్రపంచానికి చూపించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.40 లక్షల వ్యయంతో చిత్రీకరించేందుకు ఆ చానల్ ఒప్పందం కుదుర్చుకొని భారీస్థాయిలో పుష్కర ఘాట్‌లో చిత్రీకరణ చేశారు. ఈ ఛానల్‌తో పాటు ప్రైవేటు చానళ్లు, ఘాట్‌లో ఏర్పాటు చేసిన సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా పెద్ద ఎత్తున చిత్రీకరణ చేశారు. అయితే తొక్కిసలాట దుర్ఘటన జరిగిన తరువాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌చిత్రీకరించిన ఫుటేజీ, ఇతర శాఖలు చిత్రీకరించిన ఫుటేజీని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు.
గుట్టు బయట పెట్టాలి
ఈ సంఘటనకు కారకులు ఎవరో బయట పెట్టాలి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ తీసిన ఫుటేజీ బయటకు రాకుండా అడ్డుకుంటున్న వారు ఎవరో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. పుష్కర తొక్కిసలాటకు కారకులైన వారిపై కేసులు పెట్టాలి. కమిషన్ గడువు పొడిగించి వాస్తవాలు బయటకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.– ముప్పాళ్ల సుబ్బారావు,రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
గడువు పెంచరు.. నివేదిక బయటకు రాదు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిషన్ గడువు ముగిసి ఏడాది పూర్తయినా ప్రభుత్వం కమిషన్ గడువు పొడిగించకపోవడంతో కమిషన్ నివేదిక బయటకు రావడం లేదు. కమిషన్ గడువు పొడిగిస్తే నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తన తప్పులు బయట పడతాయనే ఉద్దేశంతో కమిషన్ కడువు పొడిగించడం లేదు. దీంతో కమిషన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత మంది మృతికి, గాయాలు పాలైన సంఘటనలో ఏవరు దోషులనేది బయటపడకుండానే మిగిలిపోయింది. ఇప్పటికీ పోలీస్ శాఖ చార్జ్ షీటు దాఖలు చేయని స్థితిలో ఉంది. ప్రగల్భాలు పలికే చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలంటే తక్షణం కమిషన్ గడువు పొడిగించాలి. ప్రజల సొమ్ము లక్షలాది రూపాయల వ్య యంతో నేషనల్ జియోగ్రఫీ ఛానల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఆ ఛానల్ వారు పుష్కరాల కోసం చిత్రీకరించిన ఫుటేజీని బయట పెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment