
వెబ్‌చారం
ఎవరైనా చూస్తారేమోనని సందుగొందుల్లో చీకటి మాటున భయం భయంగా ఆడామగా చెవులు కొరుక్కునే రోజులు పోయాయి. ఆన్‌లైన్‌లో సంప్రదింపులు జరిపి కోరిన యువతులతో ఇంద్రభవనాల్లో విలాసంగా గడిపే సంస్కృతి వచ్చేసింది. నగరం ఇంకా పూర్తిస్థాయిలో టూరిజం కేంద్రంగా మారకముందే హైటెక్ వ్యభిచారం విచ్చలవిడిగా విజృంభిస్తోంది.
కాల్‌గర్ల్స్ ఎట్ ఆన్‌లైన్
- ఈ-మెయిల్స్‌లో మంతనాలు
- వాట్సప్‌లో యువతుల షేరింగ్
- ఎస్‌ఎంఎస్ ద్వారా వ్యభిచార గృహాలకు...
విజయవాడ సిటీ : వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతోంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విటులను రప్పించేందుకు నిర్వాహకులు వాడుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విలాస పురుషుల కోసం మెట్రో నగరాలకు దీటుగా ఈ-మెయిల్, వాట్సప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా యువతులను సమకూర్చుతున్నారు. ఇందుకోసం విలాసవంతమైన భవనాలు, డూప్లెక్స్ హౌస్‌లు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అద్దెకు తీసుకుంటున్నారు. మరికొందరు నిర్వాహకులు రోజుల ప్రాతిపదికన అద్దెకిచ్చే అతిథి గృహాలను ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్ సహా అన్ని ప్రముఖ పట్టణాల్లో ఈ నెట్‌వర్క్ ఉంటుంది.
ఫోర్త్ లయన్ యాప్‌కు వచ్చిన సమాచారంపై దృష్టిపెట్టిన టాస్క్‌ఫోర్స్ అధికారులకు వ్యభిచార నిర్వాహకుల నెట్‌వర్క్ చూసి దిమ్మతిరిగింది. పావుగంటకు అక్షరాలా రూ.20 వేలు నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆధునిక పద్ధతుల్లో ఆన్‌లైన్ ద్వారా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నవారిని పట్టుకోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
ఈ-మెయిల్స్‌లో సంప్రదింపులు
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఈ-మెయిల్స్ ద్వారా విటులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉచిత ప్రచారం కోసం నిర్దేశించిన కొన్ని సైట్లలో నిర్వాహకులు కాల్‌గర్ల్స్ లభ్యతపై ప్రత్యేకంగా అప్‌లోడ్ చేసి పెడుతున్నారు. వీటికి ఆకర్షితులైన వారు ఈ-మెయిల్ ద్వారా తమ అభిరుచులను తెలియజేయాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా తమ వద్దనున్న వారి వివరాలు చెబుతారు. దానికయ్యే ఖర్చు, కల్పించే సౌకర్యాలు వివరిస్తారు. ఈ-మెయిల్స్ పంపడం రానివారి కోసం కొన్ని మొబైల్ నంబర్లు కూడా ఆ సైట్‌లో పెడతారు. వాటికి ఫోన్‌చేసి వెళ్లవచ్చు. కాకుంటే నేరుగా వెళ్లకుండా పలు ప్రాంతాల్లో తిప్పుతారు. ముందుగా కలిసిన వ్యక్తి ఓ ప్రాంతంలోకి తీసుకెళ్లి మరొకరికి అప్పగిస్తారు. ఆ తర్వాత మరొకరు.. ఇలా పలువురిని దాటుకుని కోరుకున్న యువతి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
వాట్సప్‌లో ఫొటోలు
విటుల అభిరుచులకు అనుగుణంగా వాట్సప్‌లో యువతుల ఫొటోలు షేర్ చేస్తారు. వీటిలో నచ్చినవారిని ఎంపిక చేసుకుని వారికి తెలియజేయాలి. ఈ మేరకు రేటు సహా అన్ని వివరాలూ తెలుసుకునేందుకు ఒక మొబైల్ నంబరు ఇస్తారు. సంబంధిత వ్యక్తులతో సంప్రదింపులు జరుగుతాయి. ఆపై అనుకున్న డబ్బును ముందుగా ఆన్‌లైన్‌లో బ్యాంకు అకౌంటుకు జమచేయాలి. నగదు జమ చేసినట్టు నిర్ధారించుకున్న తర్వాత కార్యక్రమాలన్నీ చకాచకా జరిగిపోతాయి.
ఎస్‌ఎంఎస్ ద్వారా చిరునామా
నిర్వాహకులు అడిగిన అన్ని లాంఛనాలు పూర్తిచేసిన తర్వాత విటులు ఎక్కడకు రావాలి, ఎవరిని కలవాలనే విషయాలను ఎస్‌ఎంఎస్ రూపంలో పంపుతారు. ఆ సమాచారం ఆధారంగా అక్కడికి వెళ్లి.. చెప్పిన వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వాహనాలు, మొబైల్ సహా అన్ని వస్తువులు సంబంధిత వ్యక్తికి అందజేయాల్సి ఉంటుంది. ఆపై మరో వ్యక్తి వాహనంలో వచ్చి యువతి ఉన్న ఇంటికి తీసుకెళతాడు.