పసుపుతాడే దిక్కు! | gold loan waiver not implemented in andhra pradesh | Sakshi
Sakshi News home page

పసుపుతాడే దిక్కు!

Published Mon, Jan 5 2015 1:11 AM | Last Updated on Thu, Aug 2 2018 4:59 PM

gold loan waiver not implemented in andhra pradesh

* ఒక్క పుస్తెలతాడు కూడా విడిపించలేదు
* చంద్రబాబు బంగారు రుణాల మాఫీ తీరిదీ
* బంగారు రుణమాఫీపై ‘సాక్షి’ ప్రత్యక్ష కేస్ స్టడీస్‌లో వెల్లడి
* ఎన్నికల ప్రచారంలో తాకట్టు బంగారం విడిపిస్తానన్న బాబు
* తాళిబొట్లను మీ ఇళ్లకు తెచ్చిస్తానంటూ నమ్మబలికిన వైనం
* అధికారంలోకి వచ్చాక మాఫీని అటకెక్కించే ప్రయత్నం
* జాబితాలో మూడో ప్రాధాన్యంలోకి బంగారం తాకట్టు రుణాలు
* 90% బంగారు రుణాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు

పేరు: తోటకూరు సుబ్బమ్మ (2 ఎకరాలు)
ఊరు: నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కొమ్మిపాడు గ్రామం
బంగారు రుణం: రూ. 70,000
మాఫీ: ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు

నావద్ద ఉన్న బంగారం, పొలం పేపర్లు తాకట్టుపెట్టి 2011లో బ్యాంకులో రూ.70 వేలు రుణం తీసుకున్నా. ఆ  డబ్బులతో మినుము, పెసర పంట వేశాం. టీడీపీకి ఓటేస్తే తీసుకున్న బాకీలన్నీ తీసేస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పారు. బాబు అధికారంలోకి వస్తారని వడ్డీ కూడా కట్టకుండా ఉండిపోయా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తీసుకున్న అప్పు పోతుందని ఆశపడ్డా. ఇప్పుడేమో ఒక్క రూపాయి కూడా తీసేయలేదు. తీసుకున్న అప్పు వెంటనే చెల్లించాలని బ్యాంకోల్లు నోటీసులు పంపారు. వడ్డీనే ఎక్కువైందంట. కట్టకపోతే నగలు వేలం వేస్తామని హెచ్చరిస్తున్నారు. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడ నుంచి తేవాలి?

‘‘బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల్లో తెచ్చిన వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తా. తాకట్టులోఉన్న ఆడపడుచుల తాళిబొట్లను మీ ఇళ్లకు తెచ్చిస్తా. ఒక్క అవకాశం ఇవ్వండి. రైతు తలెత్తుకు తిరిగేలా సంపూర్ణ రుణ విముక్తుణ్ణి చేస్తా...’’ - ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూరూ తిరిగి చెప్పిన మాట ఇది. ఒక్క పంట రుణాల మాఫీ అంటే మహిళల ఓట్లు పడవేమో అన్న అనుమానంతో చంద్రబాబు మహిళల బంగారం సెంటిమెంటునూ వాడుకున్నారు.

తాకట్టులో ఉన్న బంగారు నగలను విడిపించే పూచీ తనదే అని ఊరూరా నమ్మబలికారు. అలా మహిళల ఓట్లను కొల్లగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఆర్నెల్ల తర్వాత రుణ మాఫీ చేసేస్తున్నానని.. చేసేశానని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న 40 లక్షల ఖాతాల్లో.. ఒక్కరంటే ఒక్కరికి కూడా పుస్తెల తాడు చేతికి రాలేదు. అసలు వారిలో నూటికి 90 శాతం మందికి ఒక్క రూపాయి కూడా తొలి దశలోనే మాఫీ కాలేదు. మిగతా అరకొర మందికి తొలి దశలో ప్రకటించిన మాఫీ ఎంతో చూస్తే.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

ఆయా రుణాలకు చంద్రబాబు సర్కారు ప్రకటించిన మాఫీ సొమ్ము.. ఐదు విడతలు మొత్తం కలిపినా.. ఇప్పటివరకూ అయిన వడ్డీకి కూడా చాలటం లేదు. దీంతో.. వడ్డీతో సహా రుణం కట్టండి.. లేదంటే పుస్తెలు, నగలు వేలం వేస్తామంటూ బ్యాంకులు తాఖీదుల మీద తాఖీదులు పంపుతున్నాయి. ఆ నోటీసులు చేతపట్టుకుని రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి ఆయనను గెలిపించామని.. ఇప్పుడు నిలువునా మోసపోయామని రైతులు, మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.    
- సాక్షి నెట్‌వర్క్

రాష్ట్రంలో బంగారు నగలు తాకట్టు పెట్టి పంట రుణాలు పొందిన ఖాతాలు దాదాపు 40 లక్షల వరకూ ఉన్నాయి. తాకట్టు రుణాల మొత్తం దాదాపు రూ. 35 వేల కోట్లు. చంద్రబాబు హామీ మేరకు రుణ మాఫీ జరిగి బంగారు నగలను ఇంటికి తెచ్చుకున్న మహిళ ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకూ రాష్ట్రంలో లేరు. రూ. 50 వేల లోపు ఉన్న రుణాలకు కూడా విడతల వారీగా రూ. 2 వేలు, రూ. 3 వేలు చెల్లింపులే ఉంటున్నాయి. ఈ లెక్కన ఐదేళ్లు దాటినా బ్యాంకులో నగలను విడిపించుకునే పరిస్థితులు లేవు. అసలు అప్పటివరకూ బ్యాంకులు వాటిని వేలం వేయకుండా ఆపి ఉంచే ప్రసక్తి అసలే ఉండదు. అంటే.. రైతులు తమ తిప్పలు తాము పడి అప్పు, వడ్డీ తీర్చుకుంటేనే వారి పుస్తెలు, నగలు చేతికందుతాయి. లేదంటే.. ఇళ్లలో ఆడపడుచులకు పసుపు తాడే దిక్కవుతుంది.

కోటయ్య కమిటీతోనే..
రుణ మాఫీ విషయంలో బంగారం తాకట్టు రుణాలకు సంబంధించి చంద్రబాబు వేసిన కోటయ్య కమిటీలోనే కుట్రకు బీజం పడింది. కేవలం మహిళల పేర్లపై ఉన్న తాకట్టు రుణాలనే మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫారసు చేసింది. సామాన్యంగా రైతు కుటుంబాల్లో ఎక్కువ భాగం మగవారి పేరుపై భూములు ఉంటాయి. బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం పొందాలంటే విధిగా పొలం ఎవరి పేరుపై ఉంటే వారి పేరుపైనే బ్యాంకులో రుణం తీసుకోవడం సాధ్యమవుతుంది. కోటయ్య కమిటీ సిఫారసుల మేరకైతే మొత్తం బంగారు తాకట్టు రుణాల్లో 10 శాతం కూడా మాఫీ కిందకు రావు. ఈ విషయమై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు రూటు మార్చారు.

రుణ మాఫీ జీవోలో బంగారు తాకట్టు రుణాలను మూడో ప్రాధాన్యతా అంశంగా చేర్చారు. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను తెరపైకి తెచ్చి బంగారం తాకట్టు రుణాల మాఫీని దాదాపు అటకెక్కించారు. బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న తర్వాత కూడా పంటల సాగు క్రమంలో అనుకోకుండా వచ్చి పడే తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా చేజారిపోతున్న పంటను దక్కించుకునేందుకు రైతుకు అదనపు పెట్టుబడి అవసరం అవుతుంది. విధిలేని పరిస్థితుల్లో ఆడవారి మెడల్లో ఉన్న తులమో, రెండు తులాలో బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి అదనపు పెట్టుబడి సమకూర్చుకుంటారు. ఈ పరిస్థితుల్లో బంగారు తాకట్టు రుణాలను ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పరిధిలోకి తేవడమంటే.. ‘మాఫీ’ని అటకెక్కించడమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

చివరి ప్రత్యామ్నాయంగానే..
ఎంతో అవసరమైతేగానీ మహిళలు తాళిబొట్టును  తాకట్టు పెట్టరు. పుస్తెల తాడో.. చేతికున్న రెండు గాజులో.. బ్యాంకులో తాకట్టుకు తీసుకెళుతున్నప్పుడు రైతు కుటుంబం ఆవేదనతో తల్లడిల్లుతుంది. చేలో పంట ఒకవైపు పురుగుబారిన పడిపోతుంటే.. దాన్ని దక్కించుకోడానికి చేసే చివరి ప్రయత్నం బంగారం తాకట్టు పెట్టడం. ఇంతటి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాన్ని చంద్రబాబు ఎన్నికల అవసరానికి వాడుకోవడమే కాక.. పదవిలోకి రాగానే ఆడపడుచుల ఆశలను చిదిమేశారు!

ఈ విషయమై ‘సాక్షి’ రాష్ట్రవ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో అన్నదాతల  లోగిళ్లకు వెళ్లింది. బంగారు నగలు తాకట్టు పెట్టిన కుటుంబాలకు ‘మాఫీ’ ఏ మేరకు వర్తించిందని పరిశీలించింది. ‘సాక్షి’ పరిశీలనలో రుణ మాఫీ కింద బంగారు నగలను బ్యాంకు నుంచి విడిపించుకున్న ఒక్క కుటుంబమూ తారస పడలేదు. ఎవరిని పలుకరించినా ‘చంద్రబాబు ఇంతగా మోసం చేస్తాడనుకోలేదు’ అన్న నిట్టూర్పులే వినిపించాయి.

‘రెండున్నర ఎకరాల సాగుకోసం ఓ అయ్యకిచ్చిన కూతురి మెళ్లో పుస్తెలు తాకట్టు పెట్టా. రూ. 80 వేలు రుణం తీసుకున్నా. చంద్రబాబు హామీతో వడ్డీ కూడా కట్టలేదు. తీరా చూస్తే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. నగలు విడిపించలేక.. అమ్మాయి ముఖం చూడలేక ఎంతగా సతమతమవుతున్నామో.. ఆ చంద్రబాబుకేం అర్థమవుతుంది’ అని కళ్ల నీళ్లు పెట్టుకున్న బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామం రైతు చోడవరపు సూర్యనారాయణ బాధను పంచుకునేదెవరు?!

పేరు: పెంకి విజయనాయుడు (2.50 ఎకరాలు)
ఊరు: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం
కె.కొత్తవలస గ్రామం
బంగారు రుణం: రూ. 40,000
మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు...
‘‘బంగారు ఆభరణాలు తనఖా పెట్టి పట్టాదారు పాసుపుస్తకాలతో రూ. 40,000 పంట రుణం పొందాను. టీడీపీ గెలిస్తే రుణాలు మాఫీ చేస్తారని నమ్మి బాబుకు ఓట్లేశాం.  రూపాయి కూడా మాఫీ కాలేదు.బ్యాంకులు, రెవె న్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేసినా ఫలితంలే దు.వ్యవసాయ శాఖ నుంచీ ఇంత వరకు సమాధానం లేదు.’’

పేరు: బీరవల్లి చంద్రశేఖర్‌రెడ్డి (3.40 ఎకరాలు)
ఊరు: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడు
బంగారు రుణం: రూ. 62,000
మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు

వివరాలు లేవని మాఫీ చేయలేదు...
‘‘మిర్చి పంట సాగు చేసేందుకు పాసుపుస్తకం, బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రూ. 62 వేలు రుణం తీసుకున్నా. అందులో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. అదేమంటే.. మా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు కాలేదని, అందుకే మాఫీ చేయలేదని చెప్పారు. మళ్లీ బ్యాంకులకు వివరాలు ఇచ్చాను. అయినా రుణ మాఫీ కాలేదు.’’

పేరు: కోడిరెక్కల సామ్రాజ్యం (1.5 ఎకరాలు)
ఊరు: కృష్ణా జిల్లా మైలవరం మండలం మొర్సుమల్లి
బంగారు రుణం: రూ. 28,500 (24 గ్రాములు)
మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు

రుణం కట్టాలంటున్నారు
‘‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో బంగారం కుదువ పెట్టి, 1.25 ఎకరాల కాయితాలు పెట్టి రూ. 28,500 వ్యవసాయానికి అప్పు తీసుకున్నాం.  బ్యాంకు వాళ్లేమో నాలుగైదు సార్లు రుణం కట్టాలని వచ్చారు.  వడ్డీతో కలిపి లోను రూ. 40 వేల వరకు అయింది. ప్రస్తుతం చేతిలో నయాపైసా లేక పంట వేయలేదు.’’

పేరు: శ్రీనివాసరెడ్డి (5 ఎకరాలు)
ఊరు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం
బంగారు రుణం: రూ. 70,000 (భార్య గొలుసు) మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు

పత్రాలన్నీ ఇచ్చినా మాఫీ కాలేదు...
‘‘ఐదెకరాల పొలంలో వేరుశనగ సాగు చేసేందుకు గతేడాది ఫిబ్రవరిలో ఎస్‌బీఐలో బంగారం తాకట్టు పెట్టి రూ. 70,000 రుణం తీసుకున్నా. దీనికి రూ. 4,160 వడ్డీ అయింది. బ్యాంకుల్లో పత్రాలన్నీ సమర్పించినా. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో నా పేరు లేదు.  బ్యాంకోళ్లను అడిగితే ఏమో తెలీదు అంటున్నారు.’’

పేరు: చోడవరపు సూర్యనారాయణ (2.5 ఎకరాలు)
ఊరు: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామం
బంగారు రుణం: రూ. 80,000 (కూతురు పుస్తెలతాడు, నగలు)
మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు

మాఫీ లేదు... పుస్తెలూ లేవు...
‘‘నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. దానిలో చెరుకు, వరి పంట వేయడానికి నా కూతురుకు చెందిన పుస్తెల తాడు, ఇతర బంగారు గొలుసులు స్టేట్ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాను.అది చాలక రూ. 30 వేల వరకూ ప్రైవేటు అప్పులు వడ్డీకి తెచ్చి సాగు చేశాను. పంట చేతికి వచ్చాక బంగారం ఇడిపించేద్దామనుకున్నాను. మాఫీ చేస్తారని ఆశతో అసలు వడ్డీ కట్టలేదు. కొత్త అప్పులు పుట్టడం లేదు. మాఫీ అవ్వడం లేదు. బాబు అందలం ఎక్కాక మాట తప్పాడు.’’

పేరు: లోకనాథరెడ్డి (3 ఎకరాలు)
ఊరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి
బంగారు రుణం: రూ. 1.22 లక్షలు (భార్య నగలు)
మాఫీ: రూ. 5,861

ఐదేళ్లలో వడ్డీ కూడా తీరదు...
‘‘నేను 2012 మార్చిలో ఎస్‌బీఐలో పట్టాదారు పాసుపుస్తకంతో పాటు నా భార్య నగలు తాకట్టు పెట్టి, చెరకు పంట కోసం రూ. 1.22 లక్షలు రుణం తీసుకున్నా. అది వడ్డీతో కలిపి రూ. 1,55,802 అయ్యింది. తొలి విడత మాఫీ కింద రూ. 5,861 జమ అయ్యాయని బ్యాంకు వాళ్లు చెప్పారు. మొత్తంగా నాకు రూ. 29,304 మాత్రమే మాఫీ అయిందని అది ఐదు విడతలుగా ఇస్తారని చెప్పారు. అంటే.. నాకు ఇప్పటివరకూ పడిన వడ్డీ కూడా ఐదేళ్ల వరకూ తీరదు. ’’

పేరు: ఎ.డి.వి.ప్రసాద్
ఊరు: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామం
బంగారు రుణం: రూ. 1.70 లక్షలు (భార్య నగలు)
మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు

కొత్త అప్పూ లేదు...
‘‘బంగారు నగలపై ఉన్న అప్పులు మాఫీ చేస్తానని, మీ బంగారం మీ ఇంటికి తెచ్చిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మాం. ఇంట్లో ఆడవాళ్లు అయితే పూర్తిగా నమ్మేశారు. ఇంత పచ్చి మోసం చేస్తాడనుకోలేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు బ్యాంకు అధికారులు రుణమాఫీపై ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటున్నారు. ఉన్న అప్పు తీరక కొత్తగా అప్పు పుట్టక రైతులందరం నానా అవస్థలు పడుతున్నాం.’’

పేరు : సయ్యద్ షకీల్ అహమ్మద్
ఊరు : వైఎస్‌ఆర్ జిల్లా చిన్నమండెం మండలం చాకిబండ కస్పా
బంగారు రుణం : రూ. 54,000
మాఫీ : ఇంత వరకు ఏమీ కాలేదు

ప్రభుత్వం మాయ మాటలు చెప్తోంది...
‘‘చిన్నమండెం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో 2012 మే 11వ తేదీన బంగారం తాకట్టు పెట్టి, నాకు ఉన్న 3.50 ఎకరాల పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్ పెట్టి రూ. 54,000 అప్పు తీసుకున్నాను. అది ఇప్పటి వరకు వడ్డీతో కలిపి మొత్తం రూ. 60,934 అయ్యింది. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు నంబర్లు కరెక్టుగానే కంప్యూటర్‌లో నమోదు అయినా.. అవి తప్పుగా ఉన్నాయని రిపోర్టు వచ్చినట్లు బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ’’

పేరు: అంకిరెడ్డిపల్లె తిరుపాల్‌రెడ్డి (2 ఎకరాలు)
ఊరు: కడప జిల్లా, చాపాడు మండలం, చియ్యపాడు గ్రామం
రుణం: రూ.54,000
మాఫీ: రూ. 2,626

నమ్మించి మోసం చేస్తున్నాడు...
‘‘పంట కోసం 2011లో బంగారం తాకట్టు పెట్టి రూ. 54,000 రుణం తీసుకున్నాను. అప్పటి నుంచి పంట సరిగా రాలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు పంట, బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నాడు. గెలిచిన తర్వాత కూడా మాఫీ చేస్తానన్నాడు. తీరా చేయాల్సిన సమయం రాగానే నమ్మించి మోసం చేస్తున్నాడు. ఐదేళ్లలో రూ. 13,131 మాత్రమే మాఫీ అవుతుందని బ్యాంకు వాళ్లు చెప్పారు. మిగిలిన అప్పు చెల్లిస్తే కొత్త రుణం ఇస్తామంటున్నారు. ’’

పేరు : ఇసరపు అప్పయ్యమ్మ (2.74 ఎకరాలు)
ఊరు : విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం
రామయ్యపట్నం గ్రామం, బంగారు రుణం : రూ. 45,000
మాఫీ : ఒక్క రూపాయి కూడా కాలేదు

అటూ ఇటూ తిప్పుతున్నారు...
‘‘నేను ఏటా చెరకు సాగు చేసుకుంటున్నాను. 2013 సెప్టెంబర్‌లో పెదగుమ్ములూరు గ్రామీణ వికాస్ బ్యాంకు నుంచి పాస్‌పుస్తకాలు పెట్టి రూ. 45,000 రుణం తీసుకుని పెట్టుబడి పెట్టాను. అదిప్పుడు రూ. 54 వేలైంది. భారీ వర్షాలు, జల్ తుపానులతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. 2014లో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 3 వడ్డీకి అప్పు చేసి మళ్లీ పంట పెట్టాను. జాబితాలో నా పేరులేదు. అడిగితే ఆఫీసుల చుట్టూ అదే పనిగా తిప్పుతున్నారు.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement