- రుణ మాఫీ లేక పిఠాపురంలో కౌలు రైతు ఏడుకొండలు ఆత్మహత్య
- మదనపల్లిలో ఓ రైతు కుమార్తె పెళ్లికి మాఫీ చిక్కు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణ విముక్తి రైతుల పాలిట మరణమృదంగా మారింది. పంట రుణాలు, బంగారు రుణాలు అన్నదాతల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మాట లు నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో ఇప్పు డు వడ్డీ తలకు మించిన భారంగా మారింది. ఏకంగా 40 లక్షల మంది రూ.35 వేల కోట్లకు పైగా బంగారంపై రుణాలు తీసుకున్నట్లు కోటయ్య కమిటీలో స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు బంగారంపై రుణాలకు పొలం వివరాలుంటే గానీ మాఫీ వర్తించరాదంటూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇది కౌలు రైతులు, బంగారంపై రుణాలు తీసుకున్న రైతులకు మనోధైర్యాన్ని కోల్పోయేలా చేస్తోంది. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రూరల్ మండలం విరవకు చెందిన గూసాల ఏడుకొండలు పంటకోసం చేసిన అప్పు మూడు లక్షల వరకు చేరింది. రుణ విముక్తిలో పేరు లేదని తెలుసుకున్న అతను ఈ నెల 13వ తేదీన పురుగుమందు తాగాడు.చికిత్స పొందుతూ ఈ నెల 16వ తేదీన మృతి చెందాడు. అతని కుటుంబం దిక్కులేనిదైంది.
చిత్తూరు జిల్లా మదనపల్లి రైతు వెత
చిత్తూరుకు చెందిన మదనపల్లి వెంకటరమణ పంట రుణంగా రూ.50 వేలను, బంగారంపై రూ.70 వేలను సప్తగిరి గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నారు. రుణ విముక్తి తొలి, మలి జాబితాల్లో అతని పేరు లేదు. కూతురు పెళ్లి ఉండటంతో బంగారం విడిపించుకోవాలని నిర్ణయించుకుని అప్పు చేసి వడ్డీతో కలిపి రూ.84,200 లను చెల్లించారు. అయితే పంట రుణం కూడా తీర్చితేనే బంగారం ఇస్తామని బ్యాంకు మేనేజర్ మెలికపట్టారు.చేసేది లేక రూ. 50 వేల ఖరీదైన పాడిపశువును పాతిక వేల కు విక్రయించి రెన్యువల్ చేయించుకున్నారు. ఇలా పలు బ్యాంకుల్లో అప్పులు పేరుకు పోయి రైతులు అవస్థలు పడుతున్నారు.