బ్యాంకులో తాకట్టు బంగారం మాయం | Gold missing In prakasam Syndicate Bank | Sakshi
Sakshi News home page

బ్యాంకులో తాకట్టు బంగారం మాయం

Published Tue, Oct 2 2018 1:13 PM | Last Updated on Tue, Oct 2 2018 1:13 PM

Gold missing In prakasam Syndicate Bank - Sakshi

తాకట్టు బంగారం తీసుకెళ్లేందుకు వేచి ఉన్న ఖాతాదారులు

ప్రకాశం, నర్శింగోలు (సింగరాయకొండ): జరుగుమల్లి మండలం నర్శింగోలు సిండికేట్‌ బ్యాంకు బ్రాంచిలో బంగారం మాయమైందన్న ఆరోపణలు రావడం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు కోటి రూపాయల విలువైన బంగారం మాయమైందన్న ప్రచారం జరుగుతోంది. బ్రాంచి పరిధిలోని సుమారు 8 గ్రామాలకు చెందిన 27 మంది ఖాతాదారులకు చెందిన బంగారం కనిపించడం లేదు. అవకతవకలకు పాల్పడిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా ఆ బ్యాంకు ఉన్నతాధికారులు సైతం వారికి సహకరిస్తున్నారన్న ప్రచారంతో మిగిలిన ఖాతాదారులు బ్యాంకులోని బంగారం విడిపించుకునేందుకు పోటీపడుతున్నారు. అంతేగాక బ్యాంకులో పెట్టిన బంగారం స్థానంలో నకిలీ వస్తువులు పెట్టారేమోనన్న అనుమానంతో అనుభవం ఉన్న వారిని రప్పించుకుని మరీ బంగారం పరిశీలించుకుని విడిపించుకుంటున్నారు.

27 మంది ఖాతాదారులబంగారం మాయం
బ్యాంకులో తాకట్టు పెట్టిన 27 మందికి చెందిన సుమారు కోటికిపైగా విలువైన బంగారం మాయమైనట్లు ఇటీవల బ్యాంకులో జరిగిన ఆడిటింగ్‌లో బయటపడినట్లు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా దావగూడూరు, నర్శింగోలు, అగ్రహారం, పైడిపాడు, సతుకుపాడు, రెడ్డిపాలెం, అక్కచెరువుపాలెం, రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖాతాదారుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 18వ తేదీన బంగారం తాకట్టు పెట్టి 52 వేల రుణం తీసుకున్న పి.సుశీల..బ్యాంకులో అవకతవకలు జరిగాయని తెలిసి బయట 2 రూపాయల వడ్డీకి అప్పు చేసి మరీ బ్యాంకులో నగలు విడిపించుకుంది.
బ్యాంకుపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. ఇంత వరకు ఒక్కరిపై కూడా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయలేదని, దీన్ని బట్టి బ్యాంకు అధికారుల మనోగతం అర్థమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ సోమశేఖర్‌ కూడా తెలిపారు.  

నర్శింగోలు టు కందుకూరు
నర్శింగోలు బ్రాంచిలో తాకట్టు పెట్టిన ఖాతాదారుల బంగారం కందుకూరులోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. బ్యాంకులో బంగారం తనిఖీ చేసే వ్యక్తితో పాటు సదరు బ్రాంచిలో పనిచేసిన ముగ్గురు మేనేజర్ల హస్త ఉన్నట్లు తెలుస్తోంది. 2013 నుంచి బంగారం మాయమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బంగారం తాకట్టు పెట్టిన సంవత్సరం తర్వాత ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నోటీసు ఇస్తారు. తాకట్టు నగలకు డబ్బులు చెల్లించండి.. లేకుంటే ఖాతా రెన్యువల్‌ చేసుకోండని సమాచారం ఇస్తారు. ఏళ్లు దాటినా అటువంటి నోటీసులు రాలేదని ఖాతాదారులు చెబుతున్నారు. అంతేగాక కొత్తగా వచ్చిన అధికారులు నకిలీ బంగారం పెట్టారని, వెంటనే డబ్బులు చెల్లించాలని ఖాతాదారులపై ఒత్తిడి చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఒంగోలు లాడ్జిలో సమావేశం
బ్రాంచిలో అవకతవకలకు పాల్పడిని బ్రాంచి మేనేజర్లు, జిల్లా అధికారి ఇటీవల ఒంగోలులోని ఓ లాడ్జిలో సమావేశమై ప్రైవేటు ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి సమస్య పరిష్కరించాలని తీర్మానించారని ఖాతాదారులు చర్చించుకుంటున్నారు. ఆ ప్రకారం ఖాతాదారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

టీడీపీ నేతల సహకారం
బ్యాంకులో బంగారం తనిఖీ చేసే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి అధికార పార్టీ నాయకులు సహకరిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతనికి వారే భద్రత కల్పిస్తున్నారని, ఈ కేసు నుంచి అతడిని బయట పడేసేందుకు ఖాతాదారులతో మాట్లాడి ఫిర్యాదు చేయకుండా ప్రయత్నిస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement