ఖాతాల్లో సర్కారు గోల్‌మాల్ | Golmaal government accounts | Sakshi
Sakshi News home page

ఖాతాల్లో సర్కారు గోల్‌మాల్

Published Thu, Dec 4 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

ఖాతాల్లో సర్కారు గోల్‌మాల్

ఖాతాల్లో సర్కారు గోల్‌మాల్

  • అసలు ఖాతాల వివరాలను
  •  వెల్లడించకుండా తొక్కిపెడుతున్న సర్కారు
  • సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు చెప్పుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అసలు నిజాలను కప్పిపుచ్చుతోంది. వ్యవసాయదారుల రుణ ఖాతాల సంఖ్యను గోల్‌మాల్ చేసింది. ఖాతాల సంఖ్యను, వాటిపై తీసుకున్న రుణాలను తగ్గించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.

    అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గడచిన ఆరు నెలలుగా రైతులెవరు, వారి ఖాతాలేంటి పేరుతో రకరకాల కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరకు ఖాతాలు, రుణాల మొత్తాన్ని కప్పిపెట్టి తక్కువ మొత్తాన్ని చూపిస్తున్నారు. చంద్రబాబు వేసిన కోటయ్య కమిటీ పలు దఫాలుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రతినిధులతో సమావేశమై వ్యవసాయ రుణాలకు సంబంధించి మొత్తం ఖాతాలు, వాటిపై తీసుకున్న మొత్తం రుణాల వివరాలను సేకరించింది.

    ఆ కమిటీకి సమర్పించిన లెక్కల మేరకు రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న ఖాతాలు 1,29,30,864 ఉన్నాయి. తేదీల వారీగా ఖాతాల వివరాలు, వాటిపై తీసుకున్న రుణాల వివరాలను అందజేశారు. ఇందులో లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న వారి ఖాతాలు 1,22,04,456 ఉన్నాయి. రైతులు తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాలు 88,841.1 కోట్ల రూపాయలుగా ఎస్‌ఎల్‌బీసీ లెక్కతేల్చింది.

    అసలు లెక్కలు ఈ రకంగా ఉంటే.. సర్కారు ఆరు నెలలుగా కమిటీల పేరుతో రకరకాల ఎత్తుగడలతో ఖాతాలు, రుణాల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. రూ. 50 వేలు దానికన్నా లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి గురువారం ప్రకటన చేస్తారని మంత్రులు చెప్తుండగా.. అందులో పెద్ద గోల్‌మాల్ దాగి ఉందని.. రూ. 50 వేల లోపు రుణాలున్న రైతుల సంఖ్యను భారీగా తగ్గించి చూపుతున్నట్టు అర్థమవుతోంది.

    నిజానికి కోటయ్య కమిటీకి ఎస్‌ఎల్‌బీసీ సమర్పించిన గణాంకాలను ప్రభుత్వం బహిర్గతపరచకుండా మరుగున పరిచింది. ఎస్‌ఎల్‌బీసీ అందజేసిన నివేదిక మేరకు.. రూ. 50 వేలు అంతకన్నా తక్కువగా రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలు 66,91,132 ఉన్నాయి. అంటే వ్యవసాయ రుణాలు తీసుకున్న మొత్తం ఖాతాల్లో దాదాపు సగభాగం 50 వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న ఖాతాలే ఉన్నాయి.

    ఈ రూ. 50 వేల లోపు ఖాతాలపై రైతులు తీసుకున్న రుణాలు 19,495.72 కోట్ల రూపాయలు. అంటే రూ. 50 వేలు, అంతకంటే తక్కువ రుణాలు తీసుకున్న రైతుల రుణాలన్నీ ఒక్కసారిగా మాఫీ కావాలంటే 19.49 వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఐదు వేల కోట్ల రూపాయలతో మొత్తం రుణాలను మాఫీ చేయబోతున్నామంటూ జిమ్మిక్కు చేయబోతున్నట్టు అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

    కనీసం రూ. 50 వేల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేయాలన్నా 19.45 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, బడ్జెట్‌లో పెట్టిన 5 వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని, ఇదంతా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement