సాక్షి, పొదలకూరు(నెల్లూరు) : రెక్కాడితే గానీ డొక్కాడని గీత కార్మిక కుటుంబం వారిది. కల్లు గీసుకొని ఉన్నంతలో సంతోషంగా జీవించే వారు. విధి వెక్కిరించి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఉన్నదంతా ఊడ్చిపెట్టి, గ్రామంలో అప్పులు చేసి, గ్రామస్తుల సాయం పొందినా ఇప్పటికీ ఆ కుటుంబం కోలుకోలేకపోతోంది. సీఎం సహాయనిధి నుంచి సాయం కోసం ఎదురుచూస్తోంది.
కాటేసిన విద్యుత్ తీగలు
మండలంలోని మర్రిపల్లికి చెందిన అయితా శివశంకర్ (30) కల్లుగీత కార్మికుడు. సీజన్లో కల్లుగీసి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఏడాది క్రితం వివాహం కూడా చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం తాటిచెట్టెక్కి కల్లు గీస్తున్న సమయంలో చెట్టుకు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో చెట్టుపై ఉన్న శివశంకర్ విద్యుదాఘాతానికి గురై చెట్టుకే అతుక్కుపోయారు. సమీపంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు గమనించి అతికష్టంపై తాళ్లు, కర్రలతో శివశంకర్‌ను కిందికి లాగారు. దీంతో చెట్టుపై నుంచి యువకుడు కిందపడిపోయారు. విద్యుదాఘాతంతో చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. విద్యుదాఘాతం తగిలిన ప్రతి చోటా మాడిపోయి నల్లగా మారింది. వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా, చెన్నై తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
కుటుంబసభ్యులు చెన్నైలోని విజయా ఆస్పత్రిలో చేర్పించి మూడు నెలల పాటు అక్కడే ఉంచారు. విద్యుదాఘాతంతో శరీరమంతా ఇన్‌ఫెక్షన్ సోకడంతో శివశంకర్‌కు మొత్తం ఆరు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. కుడిచేయి వేళ్లు పనిచేయకపోవడంతో వాటిని తొలగించారు. దీని కోసం రూ.10 లక్షల వరకు ఆ పేద కుటుంబం వెచ్చించింది. బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు, సోదరి అప్పులు చేశారు. చికిత్స పొందుతున్న సమయంలోనే శివశంకర్‌కు ఆడపిల్ల జన్మించింది. కుమార్తెను చూసేందుకు సైతం వీల్లేకుండా ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి రావడంతో ఆ యువకుడు కుమిలిపోయారు. సీఎం సహాయనిధి నుంచి సాయం అందేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.
ఎమ్మెల్యే కాకాణి దృష్టికి తీసుకెళ్లాం
గ్రామానికి చెందిన గీత కార్మికుడు శివశంకర్ కష్టాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వెంటనే స్పందించి సీఎం సహాయ నిధి కోసం యత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా గౌడ సంఘం ద్వారా కొంత మొత్తాన్ని సాయంగా అందజేశాం. చిన్న వయస్సులో శివశంకర్ మంచానికే పరిమితం కావడం ఆవేదన కలిగిస్తోంది.
– కోసూరు సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మర్రిపల్లి
Comments
Please login to add a commentAdd a comment